రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొంత మంది ధరలపై విసిగెత్తి వాహనాలను కూడా తగలబెట్టుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన రైతు కురువ ఆంజనేయులు వైఎస్సార్ సెంటర్లో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ ధరలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోజురోజుకి ధరలను ఎలా పెంచుతారంటూ పెట్రోల్ బంక్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగాడు.
PETROL PRICE: పెట్రోల్ ధరలను చూసి విసుగెత్తి వాహనాన్ని తగులబెట్టాడు..
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి విసుగుతో సొంత ద్విచక్రవాహనాన్ని తగులబెట్టాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
అనంతరం పెట్రోల్ పోయించుకున్న ఆంజనేయులు వైఎస్సార్ విగ్రహం ముందు పెట్రోల్ తీసి తన బజాజ్ ప్లాటినం ద్విచక్రవాహనంపై పోసి నిప్పుపెట్టాడు. మంటల్లో కాలిపోతున్న వాహనాన్ని చూసి స్థానికులు నీళ్లు చల్లి మంటలను ఆర్పారు. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతే తమ లాంటి వాళ్లు ఎలా బతకాలని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్రోల్ ధరలను తగ్గించాలని.. లేకుంటే మళ్లీ ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టి తగులబెడతానన్నాడు. తన మీద పోలీసులు కేసులు పెట్టినా ఇలానే చేస్తానని ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి: చైనీస్ ఆన్‌లైన్ బెట్టింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు