తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers Protest: ఒప్పందాల కోసం రోడ్డెక్కిన అన్నదాత

జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి సాగుచేసే రైతులు (Farmers).. కంపెనీలతో ఒప్పందాల కోసం మరోసారి ఆందోళన బాట పట్టారు. నడిగడ్డ రైతుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్వంలో కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి పాలనాధికారికి సమస్యలు వివరించారు. విత్తనపత్తి రైతుల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఒప్పందాలపై ముందుకు వెళ్తామని అధికారులు హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు. జూన్, జులైలో విత్తనపత్తి సీజన్ ప్రారంభం కానుండటం వల్ల కంపెనీలు- రైతుల మధ్య ద్వైపాక్షిక, లేదా కంపెనీలు, మధ్యవర్తులు, రైతుల మధ్య త్రైపాక్షిక ఒప్పందాలు జరగాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

farmers
అన్నదాత

By

Published : Jun 22, 2021, 11:06 PM IST

Farmers Protest: ఒప్పందాల కోసం రోడ్డెక్కిన అన్నదాత

జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి సాగు చేసే రైతులు (Farmers) ద్వైపాక్షిక ఒప్పందాల కోసం మరోసారి ఆందోళన బాట పట్టారు. నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో కలెక్టరేట్ ముఖద్వారం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీగా వచ్చిన రైతులు పాలనాధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. తమ సమస్యల్ని పరిష్కారానికి హామీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

కలెక్టర్​కు విన్నపం...

కింది స్థాయి అధికారులొచ్చి వినతులు విన్నా... కలెక్టర్ రావాల్సిందేనంటూ రైతులు పట్టుబట్టారు. ఐదుగురు ప్రతినిధుల్ని కలెక్టర్ శృతి ఓఝా తన ఛాంబర్​లోకి పిలిచి సమస్యలను తెలుసుకున్నారు. దశాబ్దాలుగా విత్తన కంపెనీలు మధ్యవర్తుల ద్వారా రైతుల జిల్లాలో విత్తన పత్తిని సాగు చేయిస్తున్నాయని రైతులు కలెక్టర్​కు వివరించారు. అందుకోసం రైతులకు, కంపెనీ మధ్య ఎలాంటి ఒప్పందాలు లేకపోవడం వల్ల విత్తనం ఇచ్చిన దగ్గర నుంచి తిరిగి రైతులకు విఫల విత్తనాలు అప్పగించే వరకూ.. జరుగుతున్న దోపిడీని విన్నవించారు. వారి సమస్యలను సావధానంగా విన్న కలెక్టర్ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ప్రభుత్వ నిర్ణయం అనంతం ఒప్పందాలపై ముందుకు వెళ్తామని హామీ ఇచ్చినట్లు నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి ఛైర్మన్ రంజిత్ కుమార్ వెల్లడించారు.

కొత్తేం కాదు...

ఒప్పందాల కోసం రైతులు రోడ్డెక్కడం కొత్తేమీ కాదు. ఆందోళనలు చేపట్టినప్పుడల్లా అధికారులు... ఆర్గనైజర్లు, కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం... ఎలాంటి నిర్ణయాలు లేకుండానే సీజన్ ముగిసిపోవడం పరిపాటిగా మారింది. కాని ఒప్పందాలు మాత్రం అమలు కావడం లేదు. విత్తనపత్తి సాగు పేరిట ఆర్గనైజర్లు రైతులను చేసే దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ద్వైపాక్షిక ఒప్పందాలు జరగాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఒప్పందాలకు రూపమివ్వండి...

పెట్టుబడి కోసం ఇచ్చే అప్పులపై వడ్డీ, విత్తన ప్యాకెట్లకు చెల్లించాల్సిన డబ్బులు, జిన్నింగ్ ఛార్జీలు, తూకంలో కోతలు, పత్తికి చెల్లించే ధరలు, విఫల విత్తనాల సమాచారాన్ని ఒప్పందాల్లో చేర్చితే తమకు న్యాయం జరుగుతుందని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రైతులు, ఆర్గనైజర్లకు మధ్య లావాదేవీలన్నీ తెల్లకాగితాలపైనే జరుగుతున్నాయి. వాటికి ఒప్పందాల రూపమిచ్చి చట్టబద్దత కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈసారైనా...

గతేడాది వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనల కంపెనీలతో రైతులు త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకునేలా ముసాయిదా రూపొందించారు. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఒప్పందాలు అమలు కాలేదు. ఈసారైనా ఒప్పందాలు అమలు చేయాలని విత్తనపత్తి రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: MINISTER PRASHANTH REDDY: 'తండ్రి నీటి దొంగైతే... కొడుకు గజదొంగ'

ABOUT THE AUTHOR

...view details