నదిలో నీళ్లున్నప్పుడే ఎత్తిపోసుకుంటే ఆయకట్టు కింద పంటలు పండించే రైతులకు ఉపయోగం ఉండేది. కానీ జోగులాంబ గద్వాల జిల్లాలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం విషయంలో అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపంగా మారుతోంది. తుంగభద్ర నదిలో కావాల్సినంత వరద నీరున్నా.. అధికారులు మాత్రం ఇప్పటికీ నీళ్లు విడుదల చేయలేదు. ఫలితంగా తుమ్మిళ్ల కింద పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు సకాలంలో నీరందడం లేదు.
ఇప్పటికే ఒకటి, రెండు అందాల్సి ఉన్నా...
పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలకు ఇప్పటికే ఒకటి రెండు తడులు అందాల్సి ఉంది. వేసిన పంటలను కాపాడుకుందామన్నా.. వర్షాలు సరిగా లేవు. భూగర్భ జలమట్టాలు సైతం ఆశించినంతగా లేవు. రాజోలి బండ డైవర్షన్ స్కీం కింద చివరి ఆయకట్టు వరకూ నీళ్లందడం లేదన్న ఉద్దేశంతోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా నీళ్లు ఎత్తి పోస్తే 23వ డిస్టిబ్యూటరీ అలంపూర్ నియోజకవర్గంలో 55 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగునీరు అందించవచ్చు. వానాకాలం పంటలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. సాగునీటి జాడ లేదు. మరోవైపు తుంగభద్రకు వచ్చిన వరద నీరు వృథాగా దిగువకు వెళ్లిపోతోంది. ఫలితంగా అందుబాటులో నీరున్నా.. అవసరానికి అందక.. పంటల్ని కాపాడుకొనేందుకు రైతన్నలు నానా అవస్థలు పడుతున్నారు.
ఉల్లి, మిరప ఎదకొచ్చింది. వర్షం పడతలేదు. కాల్వ నుంచి నీరు వదలడం లేదు. ప్రాజెక్టులు నిండి.. వందల టీఎంసీల నీరు వృథాగా పోతోంది. నది పక్కనే ఉన్న మాకు నీరందడం లేదు. పక్కనే ఎత్తిపోతల పథకం ఉంది కదా అని రైతులందరూ పంటలు వేశారు. అధికారులు స్పందించి నీరు విడుదల చేయాలి.
- గోపాల్‌రెడ్డి, రైతు
పది ఎకరాల్లో పత్తి వేశాను. ఇటు తుంగభద్ర, అటు కృష్ణా నిండుగా పారుతున్నా.. మాకు నీరు రావడం లేదు. రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. అయినా అధికారులు తుమ్మిళ్ల లిఫ్ట్ ఆన్ చేయడం లేదు. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు వర్షం రాకపోతే.. రైతులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఉంది.
- పూర్ణచందర్రావు, రైతు
ఇంకో తడి అందిస్తేనే..