ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులను నకిలీ విత్తన కంపెనీలు నిండా ముంచుతున్నాయి. తక్కువ ధర, అవగాహన లోపంతో నాసిరకం విత్తనాలను అంటగడుతున్నాయి. విత్తన దందా తెలియని ఎంతోమంది అమాయక అన్నదాతలు నిండా మునిగాక లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులు ఈసారి పెద్దఎత్తున తెల్ల బంగారాన్ని సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలతో రైతుల కష్టాన్ని గంగలో కలుపుతూ రూ.కోట్లలో విత్తన దందాలు కొల్లగొడుతున్నాయి.
కాలం చెల్లిన విత్తనాల విక్రయం
రాష్ట్రంలో పత్తి విత్తన వ్యాపారం రూ.వేలకోట్లలో సాగుతోంది. ఎకరాకు సగటున 2ప్యాకెట్ల విత్తనాలు చొప్పున రైతులు కొనుగోలు చేసినా... దాదాపు కోటీ 40లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్కో ప్యాకెట్ ధర బహిరంగ మార్కెట్ లో రూ.600- 700 వరకూ పలుకుతోంది. అంటే దాదాపుగా రూ.వెయ్యి కోట్ల వరకు కొనుగోళ్లు జరుగుతాయి. ఈ అవసరాల్ని అవకాశంగా మలుచుకుంటున్నారు అక్రమార్కులు. జీవోటీ పరీక్షల్లో విఫలమైన విత్తనాలు, నాసిరకం, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత బీటీ విత్తనాలు రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నెల రోజుల్లో 90 కేసులు
నకిలీ విత్తనాల వ్యాపారం ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. వీటిని కట్టడి చేసేందుకు... రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టాస్క్ ఫోర్స్ దాడుల్లో పెద్దమొత్తంలో నకిలీ పత్తివిత్తనాలు పట్టుబడుతున్నాయి. వీటిలో 90శాతం పత్తివిత్తనాలే కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నెలరోజుల్లో టాస్క్‌ఫోర్స్ చేసిన దాడుల్లో 90కి పైగా కేసులు నమోదయ్యాయి. రూ.కోటిన్నర పైచిలుకు విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సరైన దస్త్రాలు లేనివి, కాలం చెల్లినవి, విడివిత్తనాలు, అనుమతిలేని విత్తనాలు అధికంగా ఉన్నాయి.
అవగాహన లోపం
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పు లేదు. అందుకు ప్రధాన కారణం చాలా మంది రైతులు పెట్టుబడుల కోసం వ్యాపారులపై ఆధారపడుతున్నారు. వారు ఏ విత్తనాలిస్తే వాటినే ప్రశ్నించకుండా తీసుకుంటున్నారు. అందులోనూ ఈ నకిలీ విత్తనాలు తక్కువ ధరలకే దొరుకుతుండటం... డబ్బులకు కాకుండా అరువుగా ఇవ్వడంతో వీటిని తీసుకునేందుకు కొందరు రైతులు మొగ్గు చూపుతున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి దిగుబడి రాక లబోదిబోమంటున్నారు. అక్రమ విత్తనాల వల్ల మోసపోయేది మారుమూల గ్రామాలకు చెందిన రైతులే. ఇలాంటి ప్రాంతాలపై అధికారుల నిఘా తక్కువగా ఉండటంతో అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఇక దళారులపై నమ్మకంతో దిగుబడి తక్కువ వచ్చినా పెద్దగా ఫిర్యాదులు రావడం లేదు. కొనుగోలు చేసిన విత్తనాలకు ఎలాంటి రశీదులు, ధ్రువపత్రాలు ఇవ్వకుండా దళారాలు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. రైతులు నష్టపోయినా ఎవరికి ఫిర్యాదు చేయలేని పరిస్థితి.