రాష్ట్రంలో విత్తన పత్తి అత్యధికంగా సాగయ్యే జిల్లా జోగులాంబ గద్వాల. గతేడాది 40 వేల ఎకరాల్లో విత్తనపత్తి సాగు చేయగా.. ఈసారి సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఆర్గనైజర్లు రైతులతో విత్తనపత్తిని సాగు చేయిస్తుంటారు. కానీ ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఉత్పత్తి చేస్తున్నాడు.. ఏ కంపెనీ విత్తులు సాగు చేస్తున్నాడో.. వ్యవసాయ శాఖకు తెలియదు. కంపెనీలు తమ ఉత్పత్తి వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి ముందే ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. పంట పండించాక వాటికి నాణ్యత పరీక్షలు నిర్వహించి.. మేలైన విత్తనాన్ని మాత్రమే మార్కెట్లో అమ్ముతారు. పరీక్షల్లో విఫలమైన విత్తనాలను తిరిగి వినియోగించకుండా చర్యలు తీసుకుంటే.. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చే అవకాశమే ఉండదు. అలా విఫలమైన విత్తులను దళారులు కొనుగోలు చేసి.. రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
జిల్లాలో సుమారు 14 కంపెనీలు పత్తి విత్తనాలు ఉత్పత్తి చేస్తుండగా.. సమాచారాన్ని కేవలం 2 కంపెనీలు మాత్రమే అందించాయి. ఈ పత్తి సాగు జూన్, జులైలో ప్రారంభమై.. డిసెంబర్ నాటికి ముగుస్తుంది. విత్తనం చేతికొచ్చి నాణ్యత పరీక్షల ఫలితాలు సైతం ఫిబ్రవరి కల్లా వచ్చేస్తాయి. విఫలమైన విత్తనాలను వెంటనే కంపెనీలు ఆర్గనైజర్లకు, రైతులకు తిరిగి పంపుతాయి.