DK Aruna Fired on TRS attack on BJP leaders: తెరాస నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, గ్రామాల్లో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వెల్లడించారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే తెరాస దాడులు చేస్తోందని ఆరోపించారు. భాజపా శ్రేణులపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపైనే తెరాస కార్యకర్తలు రాళ్ల దాడులు చేస్తున్నారన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం చాగాపూర్ శివారులో ఏర్పాటు చేసిన యాత్ర శిబిరం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు.
పాదయాత్రకు తెరాస శ్రేణులు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నాయని... వారిని పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. తెరాస శ్రేణుల దాడిలో తమకు చెందిన ఐదు వాహనాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దాడిలో రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. భాజపా శ్రేణులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్లెక్సీలు తగలబెట్టిన వారిని సైతం అదుపులోకి తీసుకుని.. యాత్ర సాగినన్ని రోజులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
'పాదయాత్రలో పేదలు తమ కష్టాలు, బాధలను ఏకరువు పెడుతున్నారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే తెరాస శ్రేణులు దాడులు నిర్వహిస్తున్నాయి. భాజపా శ్రేణులపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదు. మాపై తెరాస కార్యకర్తలు రాళ్ల దాడులు చేస్తున్నారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు. తెరాస శ్రేణులను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదు.?' -డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు