నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. మూడేళ్ల క్రితం స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కృషితో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో 2019 జనవరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొత్తం 24 వార్డులుగా ఏర్పడ్డాయి. గతంలో 24 వార్డులలోని కొన్ని రహదారుల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. అయితే మిషన్ భగీరథ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కారణంగా అన్ని వీధుల్లోని ప్రతి ఇంటి ముందు రోడ్డుకు మధ్యగా గుంతలు తవ్వి పైపులు అమర్చారు. 20 అడుగులకు ఒక డ్రైనేజీ గుంతను ఏర్పాటు చేశారు. దీంతో గతంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మిషన్ భగీరథ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు(underground drainage works) మొత్తం పూర్తయ్యాకే సీసీ రోడ్ల పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూగర్భ జల వ్యవస్థ పనులు పూర్తైన కొన్ని చోట్ల సీసీ రోడ్లను వేస్తున్నారు. తాజాగా ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లపై గుంతలు ఏర్పడి బురదమయమయ్యాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోగాల బారిన పడుతున్న ప్రజలు
2019లో ప్రారంభించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు(underground drainage works) ఇప్పటివరకు 80 శాతం పూర్తయ్యాయి. పనులు పూర్తికాని చోట.. చిన్న వర్షం పడినా నీరు నిలిచిపోయి ఈగలు, దోమలు వాలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
'ఆర్భాటంగా పనులు ప్రారంభించారు కానీ పూర్తి స్థాయిలో జరగడం లేదు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం కాలువలు తీశారు కానీ వాటిని పూర్తి స్థాయిలో పూడ్చలేదు. పూర్తి స్థాయిలో నిర్మాణాలను అధికార యంత్రాంగం, పాలక వర్గాలు విస్మరించినట్లుగా కనిపిస్తోంది.'