తెలంగాణ

telangana

ETV Bharat / state

విత్తన పంచాయితీ... రెండేళ్లుగా రైతన్నల నిరీక్షణ - telangan news

Cotton Seed Farmers: రైతులు పండించి ఇచ్చిన పత్తి విత్తనాలకు జీవోటీ పరీక్షలు నిర్వహించి.. ఆ విత్తనాలు విఫలమైతే వాటిని కంపెనీలు తిరిగి రైతులకు అప్పగించాలి. కానీ విఫల విత్తనాలను తిరిగి ఇవ్వడంలో కంపెనీలు చేస్తున్న జాప్యం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. రెండేళ్లు గడుస్తున్నా విఫల విత్తనాలు తిరిగి ఇవ్వకపోవడంతో వాటికి డబ్బులైనా చెల్లించాలి లేదంటే మరోసారి జీవోటీ పరీక్షలైనా నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీల మధ్య విఫల విత్తనాల పంచాయితీపై కథనం.

cotton seed companies
cotton seed farmers

By

Published : Apr 3, 2022, 5:23 AM IST

Cotton Seed Farmers: జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా సుమారు 30 వేల ఎకరాల్లో విత్తన పత్తి సాగవుతుంది. విత్తన పత్తిని సాగుచేసేందుకు ముందుగా పత్తి విత్తన కంపెనీలు... ఆర్గనైజర్ల ద్వారా రైతులకు ఫౌండేషన్ సీడ్‌ అందిస్తాయి. వాటిని సాగు చేసి ఉత్పత్తి అయిన విత్తనాలను రైతులు తిరిగి కంపెనీలకు అప్పగిస్తారు. అలా రైతుల నుంచి అందిన విత్తనాలకు కంపెనీలు జీవోటీ నిర్వహిస్తాయి. దీన్నే గ్రో అవుట్ టెస్ట్ అంటారు. జన్యు స్వచ్ఛత ఎంత ఉందో ఈ పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు. ఈ పరీక్షల్లో సఫలమైన విత్తనాలకు మాత్రమే కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయి. లేదంటే వాటిని విఫల విత్తనాలుగా పరిగణించి డబ్బులు చెల్లించవు. ఈ విఫల విత్తనాల విషయంలోనే జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీల మధ్య పరస్పర ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కంపెనీలు, ఆర్గనైజర్ల మధ్య రైతులు నలిగిపోతున్నారు.

రూ.8.3 కోట్లు బకాయిలు!: నిబంధనల ప్రకారం కంపెనీలు విఫలమైనట్లుగా తేల్చిన విత్తనాలను తిరిగి రైతులకు అప్పగించాలి. వాటిని తిరిగి అమ్మకుండా ధ్వంసం చేసి ఇవ్వాలి. విఫలమైన విత్తనాలు రైతులు పశుగ్రాసం సహా ఇతర అవసరాల కోసం మాత్రమే వినియోగించాలి. అయితే గద్వాల జిల్లాలో 2020-21లో పండించిన విత్తన పత్తిలో 20శాతం విత్తనాలు విఫలం అయినట్లు పలు కంపెనీలు ప్రభుత్వానికి నివేదించాయి. ఈ ఏడాది మరో లక్షా 10 వేల కిలోల విత్తనాలు విఫలం అయినట్లు సమాచారం. కాని ఆ విత్తనాలను ఇప్పటి వరకు కంపెనీలు రైతులకు ఇవ్వలేదు. అందుకు సంబంధించిన సుమారు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలూ రైతులకు చెల్లించలేదు. రెండేళ్లు గడుస్తుండంతో విఫల విత్తనాలైనా ఇవ్వలని లేదంటే.. మరోసారి జీవోటీ అయినా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గద్వాల జిల్లా కలెక్టర్‌కు సైతం రైతులు వినతి పత్రం సమర్పించారు.

ఆర్గనైజర్లపై ఒత్తిడి..:రైతులు, కంపెనీలకు మధ్య ఆర్గనైజర్లు మధ్యవర్తులుగా ఉంటారు. ఆర్గనైజర్లే రైతులకు విత్తన పత్తి సాగు కోసం రుణాలు అందిస్తారు. ఇచ్చిన రుణం పోనూ మిగిలిన డబ్బులు చెల్లించాలని రైతులు... ఆర్గనైజర్లపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ కంపెనీలు ఇవ్వనిదే తామేమి చేయలేమని ఆర్గనైజర్లు చెబుతున్నారు. కంపెనీలు సకాలంలో స్పందించి డబ్బులివ్వాలని.. లేదంటే విఫల విత్తనాలైనా తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.

ఏటా ఎన్ని కిలోల విత్తనాలు విఫలమయ్యాయో కంపెనీలు వ్యవసాయ శాఖకు సమాచారమివ్వాలి. అందులో కొన్ని కంపెనీలు మాత్రమే ఇప్పటి వరకు లెక్క తేల్చాయి. విఫల విత్తనాల సమాచారం ఇవ్వాల్సిన కంపెనీలు ఇంకా ఉన్నాయి. ఈ లెక్కలు తేలకపోవడంతో తాము పండించిన విత్తనాలకు డబ్బులు వస్తాయా? రావా? తేల్చుకోలేక రైతులు నలిగిపోతున్నారు. ఓ వైపు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడంతో ఆందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details