ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేస్తున్నా… పలువురు గుత్తేదారుల అక్రమ లాభర్జన ధ్యేయం మూలంగా.. తాము తీవ్ర నష్టాలకు గురవుతున్నామని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లాలో ఏటా ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.1.21 కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది. అధికారులు జిల్లాలో ఉన్న 137 చెరువులు, ఆరు రిజర్వాయర్లు, రెండు ప్రాజెక్టులు, ఒక బ్యాక్ వాటర్ ప్రాంతాలను గుర్తించి… 1.15 లక్షల చేప పిల్లలను వదులుతున్నారు. గుత్తేదారులు నిబంధనలు పాటించకుండా 500 గ్రాముల లోపు చేపల నుంచి గుడ్లను సేకరించి… చేప పిల్లలను తయారు చేయడం వల్ల ఎదుగుదల రావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆ కారణంగా 10 నెలలు దాటినా చేప పిల్లల్లో ఎదుగుదల లేదని మత్స్యకారులు అంటున్నారు.
అధికారులు, గుత్తే దారులు ఇచ్చే మామాళ్లకు అలవాటు పడి… సీడ్ సరైనదా లేదా అని నిర్ధరణ చేయకుండానే చెరువుల్లో విడుదల చేయిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం వల్ల తమకు లాభాలు వస్తాయని, తాము గట్టెక్కుతామని మత్స్యకారులు సంబురపడ్డారు. ఈ క్రమంలో చెరువుల నుంచి చేపలను తీయడం ప్రారంభించారు.