Irkichedu Conflict: జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలోని ఇర్కిచేడు రణరంగంగా మారింది. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధం చేస్తుండగా... అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలపారు. ఒక వర్గం వారు అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రయత్నం చేయగా.. మరో వర్గం అడ్డుకొన్నారు. ఆ సమయంలో చెలరేగిన ఘర్షణలో ఎస్సై కొమురయ్య కాలుకు నిప్పంటుకుని స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తుండగానే.. కొంతమంది ఆందోళనకారులు విగ్రహానికి సమీపంలో ఉన్న మరో వర్గానికి చెందిన డబ్బాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఘర్షణ గురించి తెలిసిన వెంటనే వివిధ గ్రామాలు, కర్ణాటక నుంచి జనం పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై రాళ్లు రువ్వారు. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.