పిల్లలు బడికి... పెద్దలు పనికి అంటూ ప్రభుత్వాలు.. స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రచారం చేస్తున్నా కొందరిలో మార్పురావడం లేదు. ఆర్థికి పరిస్థితుల వల్లనో... ఇతర కారణాలతో బడిఈడు బాల్యం పంటపొలాల్లో మగ్గుతోంది. జోగులాంబ జిల్లాలో ఏటా పత్తి సీజన్ వచ్చిందంటే బడులు ఖాళీ అవుతున్నాయి. పుస్తకాల సంచితో బడికెళ్లే పిల్లలంతా పొలంబాట పడతారు.
దేశంలో అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి అధికం. 50వేల హెక్టార్లలో సాగవుతుంది. జూన్, జూలైలో విత్తనం వేస్తే ఆగస్టులో క్రాసింగ్ చేయడానికి, మొగ్గలు తుంచడానికి పెద్దఎత్తున కూలీలు అవసరమవుతారు. ఆసమయంలో కూలీ రేట్లు తట్టుకోలేక పిల్లలతో సహా కుటుంబమంతా పనిచేయాల్సిన పరిస్థితి.
పత్తి పనుల కారణంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం పడిపోతుంది. సాధారణ రోజుల్లో 85శాతం ఉంటే.. ఈ సీజన్లో 60శాతమే. కొందరు విద్యార్థులైతే బడి మానేస్తారు. ఇలా విత్తనపత్తి పిల్లల జీవితాల్లో విద్యాజ్యోతులు వెలగకుండా చేస్తోంది.
అప్పులు తీర్చేందుకు తప్పని తిప్పలు
విత్తనపత్తి సాగు కోసం రైతులు ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల నుంచి అప్పులు తీసుకుంటారు. వాటిని తీర్చాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి. అందుకే ఇంటిల్లిపాది విత్తనపత్తి కోసం పనిచేస్తారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఉన్నత చదువులు అందుబాటులో లేవు. ఫలితంగా చదువు కంటే పనే మేలనే భావన తల్లిదండ్రుల్లో నెలకొంది.