తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర బడ్జెట్​... పాలమూరుకు ఊరటనిచ్చేనా..! - Central Budget 2020 Benefits in Joint Mahabubnagar district

పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో వార్షిక బడ్జెటును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు లోక్‌సభ సభ్యులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములుపై పాలమూరువాసులు ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ఈ ఏడాదైనా పరిష్కారం లభిస్తుందేమోనని జనం ఎదురుచూస్తున్నారు.

Central Budget 2020 Benefits in Joint Mahabubnagar district
కేంద్ర బడ్జెట్​... పాలమూరుకు ఊరటనిచ్చెనా..!

By

Published : Jan 30, 2020, 3:18 PM IST

17వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత గత ఫ్రిబవరిలో మొదటి బడ్జెటు సమావేశాలు జరిగాయి. పాలమూరు ఎంపీలు ఈ సమావేశాల్లో ప్రమాణస్వీకారానికే పరిమితమయ్యారు. ఇక్కడి నుంచి లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ఇద్దరూ కొత్తవారు కావటం వల్ల గత బడ్జెట్​లో ఎలాంటి ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేయలేకపోయారు. ఇపుడు రెండో బడ్జెట్​ ప్రవేశపెడుతుండటంతో ఈ సారైనా పాలమూరు వాణి దిల్లీలో వినిపించాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పాలమూరు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా, రైల్వే ప్రాజెక్టుల సాధన, కేంద్ర విద్యాలయాల ఏర్పాటు తదితర హామీలను వీరు ఎన్నికల్లో ఇచ్చారు.

జాతీయహోదా ఈసారైనా దక్కేనా...?

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని లక్షా 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రధానంగా నిధులలేమి కారణంగానే ఈ పనులు ముందుకు సాగడం లేదు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవటం వల్ల గుత్తేదారులు పనులను నెమ్మదిగా చేస్తున్నారు. పీఆర్‌ఎల్‌ఐ పనులు త్వరగా పూర్తి కావాలంటే పెద్దఎత్తున నిధుల కేటాయింపులు అవసరం. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా లభిస్తే నిధులు దండిగా వచ్చే అవకాశం ఉంది. బడ్జెటులో ఈ ఎత్తిపోతల పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు రెండు రోజుల కిందట జాతీయ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నందకిశోర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు ఏ మేరకు కేటాయించనున్నారో చూడాలి.

రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా...?

గత కొన్నేళ్లుగా పాలమూరు రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. గద్వాల - మాచర్ల రైల్వేలైను కోసం దశాబ్దకాలంగా పాలమూరువాసులు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు వస్తే గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాలకు రైల్వేపరంగా రవాణాసౌకర్యం కలగడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కృష్ణా - వికారాబాద్‌ రైల్వే పనులు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ రైల్వేలైను వస్తే వెనుకబడిన కొడంగల్‌, నారాయణపేట నియోజకవర్గాలు మరింత అభివృద్ధి సాధిస్తాయి.

సైనిక్‌ పాఠశాల వచ్చేలా ఒత్తిడి తెస్తా

నారాయణపేటలో సైనిక పాఠశాల ఏర్పాటుపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు గతంలోనే వినతిపత్రం ఇచ్చాం. ఈ సమావేశాల్లో లోక్‌సభలో ఆ అంశాన్ని ప్రస్తావిస్తా. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక నిధులు అడుగుతాం. దివిటిపల్లి రైల్వేస్టేషను ఆధునికీకరణకు నిధులు వచ్చేలా చూస్తాను. పెండింగు రైల్వే ప్రాజెక్టు పనులకు మోక్షం కలిగేలా సభలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. దేవరకద్రకు నవోదయ విద్యాలయం, షాద్‌నగర్‌కు కేంద్రీయ విద్యాలయం కావాలని సభ దృష్టికి తీసుకెళ్తా.
- మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ

నియోజకవర్గ అభివృద్ధి నిధులపై ప్రశ్నిస్తా

ఈ బడ్జెటు సమావేశాల్లో నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధుల గురించి సభలో ప్రశ్నిస్తా. పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు అవసరం. దీనిపైనా లోక్‌సభలో చర్చిస్తా. కేంద్ర విద్యాలయం, నవోదయ విద్యాలయాలు జిల్లాలో లేవు. వీటిని మంజూరుచేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తా. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇప్పటికే సభలో మాట్లాడే అంశాలపై మాకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్‌ సూచనల మేరకు సభలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడతా.
- పోతుగంటి రాములు, నాగర్‌కర్నూలు ఎంపీ

కేంద్ర విద్యాలయాలు ఏవీ?

పాలమూరు ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు ఎన్నికలకు ముందు ప్రతి జిల్లాకు కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నారాయణపేటకు మంజూరైన సైనిక పాఠశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. జిల్లా శివారులో ప్రభుత్వం స్థలం కేటాయించినా కేంద్రం నుంచి అనుమతులు రావడం లేదు. జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రసాద్‌ నిధులు వచ్చాయి. పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. ఉపాధి కోసం ప్రత్యేక పరిశ్రమల ఆవశ్యకత ఉంది. ప్రధానంగా ఈ అంశాలే పాలమూరు ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించాల్సి ఉంది.

ఇవీ చూడండి: ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను విచారించిన ఎన్​హెచ్​ఆర్సీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details