Bandi Sanjay Latter to CM KCR: తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలంటూ... సీఎం కేసీఆర్కు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రకటించి పక్షం రోజులు గడుస్తున్నా.... కొనుగోలు కేంద్రాలు తెరవలేదని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన... రైతులతో ముచ్చటించారు.
రాష్ట్రంలో 7 వేల కేంద్రాలకు 2,500 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారన్నారు. 60 లక్షల టన్నుల ధాన్యం కొనాల్సి ఉండగా... కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొన్నారని చెప్పారు. కొనుగోలు సాగకపోవడం వల్ల కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు, కల్లాల్లో ధాన్యం ఆరబోసుకున్న రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. అవసరమైన గోనెసంచులిచ్చి, కొన్నధాన్యానికి వెంటనే చెల్లించాలని కోరారు.