జోగులాంబ గద్వాల జిల్లాలో బీసీ యువతకు రాయితీ రుణాలు అందించడంలో సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లు గడుస్తున్నా.. ప్రకటించిన లక్ష్యం మేర కూడా రుణాలు అందించని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాత్రమే రుణాలు అందించగా, ఏటా జరగాల్సిన రుణాల మంజూరు అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రుణాలు అందించలేదు. కొవిడ్-19 కారణంగా చాలా మంది యువత ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ప్రకటించిన రుణాలు అందించినా, వేలాది మందికి ఉపాధి లభిస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
ప్రతి ఏటా బీసీ రాయితీ రుణాలు అందించాల్సి ఉండగా, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం నిధుల కేటాయించకపోవడం వల్ల రుణాలు అందలేదు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రుణాల మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానించింది. రెండేళ్ల విరామం తరువాత ప్రకటన రావడం వల్ల ఎంతో ఆశతో జిల్లాలో 3,125 మంది దరఖాస్తులు చేసుకున్నారు. విడతల వారీగా రుణాలని నిర్ణయించారు.
ఈ మేరకు మొదటగా వందశాతం రాయితీతో రూ.50 వేల చొప్పున రుణాలు ఇచ్చే ప్రక్రియను 2018 ఆగస్టు 15న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. అయినా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం వల్ల లబ్ధిదారులందరికీ రుణాలు అందలేదు.
ఇచ్చింది 937 మందికే.. :
జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 255 గ్రామ పంచాయతీలు, నాలుగు పురపాలికలున్నాయి. వీటిలో వేలాది మంది యువకులు ఉద్యోగాలు లేక నిరుత్సాహంలో ఉన్నారు. వీరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. రెండున్నరేళ్ల క్రితం జిల్లాలో బీసీ రుణాల కోసం మొత్తం 3125 మంది వ్యక్తిగత రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే గ్రూపు రుణాల కోసం మరో 7200 దరఖాస్తులు చేసుకున్నారు.