తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay: 'భాజపా గెలిస్తే ఆర్డీఎస్ ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం'

Bandi Sanjay: భాజపా అధికారంలోకి వస్తే ఆర్డీఎస్​కు 15 టీఎంసీల నీటి కేటాయింపులతో చివరి ఆయకట్టు వరకూ లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. అవసరమైతే చివరి ఆయకట్టు ప్రాంతాల్లో ఎత్తిపోతలు ఏర్పాటు చేసి మరీ అలంపూర్ నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఎక్కడో ఉన్న గోదావరి నుంచి లక్షల కోట్లు వెచ్చించి ఫాంహౌజ్​కు సాగునీళ్లు తెచ్చుకున్న కేసీఆర్​కు, ఆర్డీఎస్​ ఆధునీకరణ కోసం 70కోట్లు ఇచ్చేందుకు చేతులు రాలేదని మండిపడ్డారు. ఎడారిని తలపిస్తున్న అలంపూర్ కేసీఆర్​కు పచ్చగా కన్పిస్తుందా అంటూ ధ్వజమెత్తారు. ఆర్డీఎస్ తూమును బద్దలు కొట్టి నీళ్లు తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు.

By

Published : Apr 17, 2022, 7:47 PM IST

Updated : Apr 17, 2022, 7:57 PM IST

Bandi Sanjay: 'భాజపా గెలిస్తే ఆర్డీఎస్ ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం'
Bandi Sanjay: 'భాజపా గెలిస్తే ఆర్డీఎస్ ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం'

Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాలుగో రోజు ప్రశాంతంగా కొనసాగింది. చండూరు క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర నుంచి జల్లాపూర్, బోరవెల్లి, మానవపాడు స్టేజీ, నారాయణపురం స్టేజీ, నుంచి వల్లూరు వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా జల్లాపూర్, బోరవెల్లి గ్రామాల్లో జనం గోస, భాజపా భరోసా పేరిట రచ్చబండ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బహిరంగ పత్రికా ప్రకటన విడుదల చేశారు. భాజపా అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకూ లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామని జోగులాంబ సాక్షిగా ఆయన హామీ ఇచ్చారు. ఎక్కడో ఉన్న గోదావరి నుంచి ఫాం హౌజ్​కు నీళ్లు తెచ్చుకున్న కేసీఆర్​కు.. ఆర్డీఎస్ ఆధునీకరణకు 70 కోట్లిచ్చేందుకు చేతులు రావడం లేదన్నారు.

ఎందుకింత వివక్ష.. రైతులు సొంతంగా ఎత్తిపోతలు పెట్టుకునేందుకు సిద్ధమైనా అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎడారిని తలపిస్తున్న అలంపూర్.. కేసీఆర్​కు పచ్చగా కన్పిస్తుందా అని ధ్వజమెత్తారు. గద్వాల జిల్లా ప్రజలంటే కేసీఆర్​కు ఎందుకింత వివక్షని ప్రశ్నించారు. ఆర్డీఎస్ తూమును బద్దలు కొట్టి నీళ్లు తీసుకొస్తామన్న కేసీఆర్​ హామీ ఏమైందని ఎదురు దాడికి దిగారు. సంగమేశ్వరం పేరుతో ఏపీ ప్రభుత్వం రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదన్నారు. సమైక్య పాలనలోనైనా ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు 5.5 టీఎంసీల నీరు పారిందని, కేసీఆర్ పాలనలో మాత్రం చుక్క నీరు కూడా అందడం లేదన్నారు. భాజపా అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ ద్వారా 15.6 టీఎంసీల నీరు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి, కళాశాలలు, గ్రామాలకు బస్సు సౌకర్యం, మిర్చి మార్కెట్ సహా పలు సమస్యలను పరిష్కరించలేని మంత్రులు, శాసనసభ్యులు ఎందుకన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక అలంపూర్​కు మిర్చి మార్కెట్ మంజూరు చేస్తామన్నారు.

అడ్డుకుని తీరుతాం.. 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పడు కరెంటు ఛార్జీలను పెంచుతున్నారని బండి సంజయ్​ ధ్వజమెత్తారు. వచ్చే నెల నుంచి విద్యుత్ బిల్లులు రెట్టింపు కాబోతున్నాయన్న ఆయన ఛార్జీల పెంపును అడ్డుకుని తీరతామన్నారు. కేసీఆర్ సహా మంత్రులు తమ వ్యవసాయ క్షేత్రాలకు ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారని.. ఆ ఖర్చుతో 20-30 గ్రామాలకు ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అసత్యాలు చెప్పి రైతులను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లీటర్ పెట్రోలుపై 30 రూపాయలు వసూలు చేస్తున్న కేసీఆర్.. ధరల పెంపుపై భాజపా గురించి మాట్లాడమేంటన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించి లీటరుపై 20 నుంచి 30 రూపాయలు భారం తగ్గించామని, కేసీఆర్ కూడా తగ్గిస్తే 80 రూపాయలకే లీటరు పెట్రోలు దొరుకుతుందని చెప్పారు.

అందుకే యాత్ర చేస్తున్నా.. తెలంగాణలో ఎవరికి ఉద్యోగాలు, పదవులు దక్కాయో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. పక్క రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తుంటే తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. వ్యాక్సిన్, రేషన్, గ్రామ పంచాయతీ అభివృద్ది పనులకు నిధులు, ఇవన్నీ కేంద్రమే ఇస్తోందని, అవసరమైతే తెరాస సర్పంచ్​లు, శాసనసభ్యులను ప్రజలు నిలదీసి అడగాలన్నారు. ఓట్ల కోసం తాను పాదయాత్ర చేపట్టలేదన్న సంజయ్.. ప్రజల కష్టాలు తెలుసుకుని వారి అభీష్టానికి అనుగుణంగా ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసేందుకు యాత్ర చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ అరాచక, అవినీతి పాలనను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యాత్ర చేస్తున్నానని వెల్లడించారు.

ప్రజలే కేసీఆర్​కు బుద్ధి చెప్పాలి.. భాజపా మాత్రమే ప్రజల కోసం పోరాడుతోందన్న ఆయన.. దాడులు, లాఠీఛార్జ్​లు, కేసులు, జైళ్లు భరించి పోరాటాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రజల కష్టాలు తీరాలంటే భాజపా అధికారంలోకి రావాలన్న సంజయ్.. కమలం పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పేదల ప్రభుత్వం కావాలో, పెద్దల ప్రభుత్వం కావాలో ఆలోచించాలని, పైసలిస్తే ఓట్లేస్తారనే భ్రమల్లో కేసీఆర్ ఉన్నారని.. ప్రజలే కేసీఆర్​కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఐదో రోజు వేముల, బడ్లదిన్నె, షహబాద్ మీదుగా పాదయాత్ర సాగనుంది.

ఫాంహౌజ్​కు నీళ్లు తెచ్చుకునేందుకే.. జోగులాంబ సాక్షిగా హామీ ఇస్తున్నా.. భాజపా గెలిస్తే ఆర్డీఎస్ ద్వారా మొత్తం ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం. చివరిప్రాంతాల్లో అవసరమైతే లిఫ్టులు ఏర్పాటు చేస్తాం. లక్ష ఎకరాలకు నీరిచ్చి అలంపూర్‌ను సస్యశ్యామలం చేస్తాం. ఎక్కడి గోదావరి... ఎక్కడి కేసీఆర్ ఫాంహౌజ్. ఫాంహౌజ్‌కు నీళ్లు తెచ్చుకునేందుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు రూ.70 కోట్లు ఇచ్చేందుకు చేతులు రావట్లేదు. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Apr 17, 2022, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details