తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi Sanjay: 'తేడా వస్తే కేసీఆర్‌ గడీని బద్దలు కొడతాం..'

Bandi Sanjay: దేశంలో 80శాతం ఉన్న హిందువుల గురించి భాజపా మాట్లాడకపోతే తెలంగాణలో హిందువుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గద్వాల్‌ జిల్లా అలంపూర్‌ నుంచి బండి సంజయ్‌ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభమైంది. ఈ దేశంలో ఏ మతానికి, ఏ వర్గానికి భాజపా వ్యతిరేకం కాదన్నారు. అధికారంలోకి వచ్చాక కేసీఆర్​ సంగతి చూస్తామన్న సంజయ్​.. తేడా వస్తే గడీలు బద్దలు కొడతామన్నారు.

Bandi Sanjay: 'తేడా వస్తే కేసీఆర్‌ గడీని బద్దలు కొట్టుడే..'
Bandi Sanjay: 'తేడా వస్తే కేసీఆర్‌ గడీని బద్దలు కొట్టుడే..'

By

Published : Apr 14, 2022, 8:48 PM IST

Updated : Apr 15, 2022, 3:38 AM IST

'తేడా వస్తే కేసీఆర్‌ గడీని బద్దలు కొట్టుడే..'

రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనను అంతమొందించడానికే మలి దశ పాదయాత్ర ప్రారంభించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. ఈ యాత్ర ద్వారా గడీలను బద్దలు కొట్టుడే అంటూ నినదించారు. ప్రజలు అండగా ఉండి యాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌ నుంచి గురువారం ప్రారంభమైంది. ఇమామ్‌పూర్‌ వరకు నాలుగు కిలోమీటర్లు మొదటి రోజు యాత్ర నిర్వహించారు. అంతకు ముందు అలంపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్‌ మాట్లాడారు. యాత్రలో ప్రజాసమస్యలు తెలుసుకొని భరోసా ఇవ్వడంతో పాటు నరేంద్రమోదీ పథకాలను వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చెబుతామన్నారు. వరి కొనబోమన్న సీఎంతోనే ధాన్యం కొనిపిస్తున్న ఘనత భాజపాదే అన్నారు. మిర్చి రైతులు తెగుళ్లతో ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు నష్టపోయిన రైతు కుటుంబాలకు ఒక్క పైసా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ జయంతి రోజు ముఖ్యమంత్రి కనీసం బయటకు కూడా రాలేదన్నారు. జోగులాంబ ఆలయం ఎంతో శక్తిమంతమైందని.. దీన్ని ఎందుకు పునరుద్ధరించట్లేదని ప్రశ్నించారు. దసరా ఉత్సవాలను ఆలయంలో ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా జరుపుతామన్నారు. బుధవారం కోర్టు కొట్టివేసిన ఎంఐఎం కేసును భాజపా అధికారంలోకి రాగానే తిరగదోడతామన్నారు.

హిందూ దీక్షలకు సమయం ఇవ్వరా..?

రంజాన్‌ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులు నమాజు చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తూ జీవో ఇచ్చిందని, దానిని తాను వ్యతిరేకించడం లేదని.. అయ్యప్ప, హనుమ, శివ భక్తులు భిక్షకు వెళ్లడానికి, పూజ చేసుకోవడానికి ఎందుకు సమయం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. భాజపా అధికారంలోకి వస్తే ప్రత్యేక జీవోలు తీసుకొచ్చి హిందూ భక్తులకు వెసులుబాటు కల్పిస్తామన్నారు. 2014 కంటే ముందు జోగులాంబలో పాదయాత్ర చేసిన కేసీఆర్‌ ఆర్డీఎస్‌ను ఆధునికీకరిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా యాత్ర : తరుణ్‌ఛుగ్‌

కేసీఆర్‌ మూగ, చెవిటి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మహా సంగ్రామయాత్రను ప్రారంభించామని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజానీకం భాజపా వైపు చూస్తోందన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో భాజపాదే భవిష్యత్తన్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. తెరాస అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయినా పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం సీఎం నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రజా సంగ్రామ యాత్ర తెరాసకు సమాధి కట్టబోయే యాత్రగా మారుతుందన్నారు. మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్‌, జితేందర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు.

జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సాయంత్రం 5 గంటలకు అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్‌గా బహిరంగ సభ వేదికకు వచ్చిన సంజయ్‌ అక్కడ అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 15, 2022, 3:38 AM IST

ABOUT THE AUTHOR

...view details