Bandi Sanjay: పన్నెండొందల మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెరాస నేతలు లిక్కర్, భూమి, ఇసుక, డ్రగ్ మాఫియాలుగా మారి జలగల రూపంలో ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని ఆరోపించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో కేసీఆర్ డబ్బులను ఎత్తిపోసుకున్నారని విమర్శించిన ఆయన ఉద్యమ సమయంలో ప్రస్తావించిన ఆర్డీఎస్ పథకాన్ని రాష్ట్రం వచ్చిన తర్వాత ఆధునికీకరించలేదు కానీ.. గోదావరి నుంచి కాళేశ్వరం పథకంతో తన ఫాంహౌస్‌కు నీళ్లు ఎత్తిపోసుకున్నారని ధ్వజమెత్తారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం ఇమాంపూర్ నుంచి లింగనవాయి వరకు సాగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో రోజు ప్రజాసంగ్రామ యాత్రŸలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ పథకం తీసుకొస్తే కేసీఆర్ ప్రభుత్వం మోకాలడ్డుతోందన్నారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. మహిళా సంఘాలకు కేంద్రమే రుణాలిస్తోందని, కరోనా రోజుల నుంచి పేదలకు ఉచితంగా అయిదు కిలోల బియ్యం ఇస్తున్నామని, ఈ ఏడాది సెప్టెంబరు వరకు కొనసాగిస్తామని వెల్లడించారు.
వ్యవసాయానికి ఏడు గంటలే విద్యుత్తు..
వచ్చే నెల నుంచి ప్రజలకు కరెంటు షాక్ తెలుస్తుందని సంజయ్ అన్నారు. పెంచిన ఛార్జీలతో బిల్లులు రెండింతలు కాబోతున్నాయన్నారు. డిస్కంలకు రూ.60 వేల కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదని, అందుకే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును ఏడు గంటలకు పరిమితం చేశారన్నారు.
ప్రజా సమస్యలు వింటూ..
పాదయాత్ర మధ్యలో ఉపాధి హామీ పథకం కూలీలతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముచ్చటించారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా అని ప్రశ్నించగా లేదని వారు చెప్పారు. అనంతరం లింగనవాయి గ్రామ ఆంజనేయస్వామి ఆలయం వద్ద రచ్చబండ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. యాత్రలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు.