1983లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అతి పురాతనమైన అలంపురం ప్రదర్శనశాలను ప్రారంభించారు. ఎన్నో శిల్పాలు, శిలాశాసనాలు ఇందులో భద్రపరచబడ్డాయి. 7వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు వివిధ రాజులు పాలించిన శాసనాలు, శిల్పాలు ఈ ప్రదర్శన శాలలో చూడవచ్చు. ఇక్కడి శిల్ప సంపద ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రదర్శనశాలకు వెళ్లి బహుమతులు గెలుపొందింది.
అలంపురం.. ప్రాచీన సంపదకు సజీవ సాక్ష్యం..! - alampur ancient museum
అలంపూర్ క్షేత్రంలో పురావస్తు ప్రదర్శనశాల అలంపురం చరిత్ర చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అత్యంత ప్రాచీనమైన సంపదకు నెలవుగా ఈ ప్రదర్శనశాల ప్రసిద్ధి చెందింది. అత్యంత అరుదైన 108 శిలావిగ్రహాలు, 26 శాసనాలు ఇందులో మనకు దర్శనమిస్తాయి.
![అలంపురం.. ప్రాచీన సంపదకు సజీవ సాక్ష్యం..! ancient museum in jogulamba gadwal alampur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10407285-665-10407285-1611813489018.jpg)
ఈ ప్రదర్శనశాలలోని సూర్య విగ్రహం 1984లో ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో పాల్గొని ఎన్నో బహుమతులు, ప్రశంసా పత్రాలను గెలుపొందింది. ఈ విగ్రహం చూడగానే జీవకళ ఉట్టిపడేలా ఉంటుంది. అదే విధంగా నటరాజ విగ్రహం 1977లో లండన్ ప్రదర్శనకు, 2008లో నాగ విగ్రహం బెల్జియం వెళ్లి మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఇలాంటి ఎన్నో అత్యంత అరుదైన శిలా విగ్రహాలు ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. మహిషాసురమర్ధిని, సప్తమాతృకలు, ద్వారపాలక విగ్రహాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. వీటితో పాటు 26 శిలాశాసనాలు కూడా ఉన్నాయి. ప్రదర్శనశాలలోని విగ్రహాలు, శిలాశాసనాలు అలంపురం క్షేత్రం చుట్టుపక్కల చేపట్టిన తవ్వకాల్లో బయటపడినవే కావటం విశేషం.
ఐదో శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందిన అలంపూర్లో జోగులాంబ అమ్మవారితో పాటు బాల బ్రహ్మేశ్వర స్వామి, నవబ్రహ్మ ఆలయాలు కొలువుదీరాయి. ఈ ఆలయాలన్ని దర్శించుకొని వస్తూ... ప్రదర్శనశాలను వీక్షిస్తే... క్షేత్ర విశేషాలు ఎన్నో తెలుస్తాయని భక్తులు, పర్యాటకులు చెబుతున్నారు.