Wine Shops : రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదాయమున్న మద్యం దుకాణాల్లో... జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మద్యం దుకాణాలు ఒకటి. గతంలో అక్కడ రెండు దుకాణాలుండగా.. ఈసారి నాలుగు దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. ఈ దుకాణాల్లో మద్యానికి భారీ డిమాండ్ ఉంటుంది. కారణం పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్లో అన్నిబ్రాండ్ల మద్యం లభించదు. ధరలూ అధికమే. అక్రమంగా సరిహద్దులు దాటడంతో పాటు కొనుగోళ్లు ఎక్కువే. అందుకే ఆ దుకాణాలపై రాయలసీమ వ్యాపారుల కన్నుపడింది. నిబంధల ప్రకారం ఆబ్కారీశాఖకు నిర్ణీత రుసుం చెల్లించి ఆయా దుకాణాల్లో ఎవరైనా భాగస్వాములుగా చేరొచ్చు. ఈ లొసుగులను ఆసరాగా చేసుకుని వాటిని దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సీమ వ్యాపారులు. ఇప్పుడున్న రెండు దుకాణాలు.. అలంపూర్ చౌరస్తాలో ఉన్నాయి. టోల్ గేట్ దాటి పుల్లూర్ వైపు.. పంచలింగాల చెక్ పోస్టు వద్ద మరో రెండు దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని దక్కించుకునేందుకు సీమ వ్యాపారులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
విద్యార్థుల ఆందోళన..
ఓవైపు ఎలాగైనా దుకాణాలు దక్కించుకోవాలని వ్యాపారులు ప్రయత్నం చేస్తుంటే.. అసలు మద్యం దుకాణాలే వద్దంటూ స్థానికులు, విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. అలంపూర్ చౌరస్తాలో అలంపూర్ వెళ్లేమార్గంలో ఒకటి.. కర్నూల్ వెళ్లే మార్గంలో మరో దుకాణం ఉన్నాయి. వారాంతాలు, సెలవుదినాల్లో ఈ రెండు ప్రాంతాలు జాతరను తలపిస్తాయి. ఏపీ నుంచి జనం విపరీతంగా వస్తారు. బహిరంగ ప్రదేశాల్లోనే మద్యం సేవిస్తారు. వీటికి దగ్గర్లోనే ప్రైవేటు పాఠశాల, కళాశాలలున్నాయి. విద్యార్థులకు మద్యం ప్రియులతో.. ఇబ్బంది తప్పడం లేదు. జోగులాంబ అమ్మవారి దేవస్థానానికి వచ్చి పోయే భక్తులు, ఆయా గ్రామాలకు వెళ్లాల్సిన స్థానికులు, రైతులు, కూలీలు అదే మార్గంలో వెళ్లాలి. కానీ చౌరస్తా అంతటా మందుబాబులతో నిండి ఉండటం సామాన్య జనానికి ఇబ్బందిగా మారుతోంది.