జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణంలోని వివేకానంద యూత్ సొసైటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ.. అవసరమైన వారికి చేయూతనందిస్తూ ఈ యువకులు సామాజిక సేవలో తమకెవరూ సాటిలేరని నిరూపిస్తున్నారు. పట్టణానికి చెందిన 20 మంది యువకులు కలిసి శ్రీవివేకానంద యూత్ అసోసియేషన్ను ప్రారంభించారు. 20 మందితో మొదలైన ఈ అసోసియేషన్లో ప్రస్తుతం 100 మంది సభ్యులున్నారు.
రక్తదానం..
ఈ యువకులు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతి ఏడాది వివేకానంద జయంతి రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా రక్తం కావాల్సి వస్తే.. సామాజిక మాధ్యమాల్లో వారు ఏర్పాటు చేసుకున్న గ్రూపుల ద్వారా రక్తదానం చేస్తున్నారు. రక్తదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు.
విశ్రాంతి సముదాయం..
తమ అసోసియేషన్ తరఫున విద్య, వైద్యానికి మొదటి ప్రాధ్యానతనిస్తున్న యువత.. అలంపూర్ పట్టణంలో ఉన్న ప్రభుత్వాస్పత్రిలో రోగులు, వారి బంధువుల ఇబ్బందులు గమనించి దాతల సహకారంతో విశ్రాంతి సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్ద గురు, శుక్ర వారాల్లో రాత్రి పూట అన్నదానం చేస్తున్నారు. జోగులాంబ ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మద్యం దుకాణాన్ని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులతో పోరాటం చేసి ఊరి చివరకు తరలించారు.
కరోనా వేళల్లోనూ సేవలు..
విద్య, వైద్యానికే గాక పర్యావరణ పరిరక్షణకు అలంపూర్ యవత తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రతి ఏటా 500 మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తూ ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో ఎంతో మంది వలస కూలీలకు ఆశ్రయం కల్పించి ఆహారం పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన ఎంతో మందికి దాతల సహకారంతో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
సమాజానికి ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయాలని నిరూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అలంపూర్ పట్టణ యువత.