అలంపూర్.. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవది. అత్యంత చారిత్రక పర్యటక కేంద్రం. అయినా ఏం లాభం... ఏ పుణ్యక్షేత్రంలోనైనా కనిపించే కనీస వసతులు ఇక్కడ కనిపించవు. తనివితీరా రోజంతా గడపాలనుకునే భక్తులకు సత్రాలే లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కనీస సౌకర్యాలు కల్పించండి:
హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి 18 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా.. సరైన రవాణా సౌకర్యం లేక ఎక్కువ మంది రాలేకపోతున్నారు. ఒకప్పుడు కర్నూల్ నుంచి బస్సులు నడిచేవి. రాష్ట్ర విభజన తర్వాత అలంపూర్ గద్వాల డిపో పరిధిలోకి వెళ్లింది. అక్కడి నుంచి బస్సులు లేక ప్రయాణికులు ఆలయానికి వెళ్లడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఒకవేళ వాహనాల్లో వచ్చినా సరైన పార్కింగ్ సదుపాయం లేదు.
శంకుస్థాపనకే పరిమితం:
ఆలయంలో అడుగుపెట్టాక అన్నింటికీ సర్దుకుపోవాల్సిందే. మంచినీళ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి. సామగ్రిని భద్రపరచుకుందామన్నా లాకర్లు లేక.. చేతిలో పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. కాసేపు సేదతీరుదామన్న మండపాలు లేవు. గుళ్లోనే చెట్ల కింద ఉండాల్సిందే. ఆలయ ప్రాంగణంలో సంచరించే పందులు, మేకల ఆగడాలకు అంతే లేదు. తెలంగాణ ప్రభుత్వం కోటీ 20 లక్షలతో చేపట్టిన పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి.