తెలంగాణలోనే వెలసిన ఏకైక శక్తిపీఠం. శ్రీశైల క్షేత్రానికి పశ్చిమద్వారం. అత్యంత ఆధ్యాత్మిక, చారిత్రక పర్యటక కేంద్రం అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం. అక్కడి నవబ్రహ్మ దేవాలయాలు.. భారతీయ సంసృతి, సంప్రదాయాలకు, వారసత్వ సంపదకు ప్రతీకలు. అలంపూర్ ఆలయనగరిని ఒకప్పుడు హలంపురం, హేమళపురం, హతంపురం అని పిలిచేవారు.
అలంపూర్ చరిత్ర
అష్టాదశ శక్తిపీఠాల్లో కొలువైన అమ్మవారి శరీరభాగాల్లో దవడ భాగం అలంపూర్లో పడిందని చరిత్ర చెబుతుంది. అందుకే అక్కడ దేవి.. ఉగ్రరూపిణిగా దర్శనమిస్తారు. కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, బాల బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, విశ్వబ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ పేర్లతో శివాలయాలు అక్కడ వెలిశాయి. తెలంగాణలోని ఇతర శైవక్షేత్రాలకు ఈ దేవాలయ నిర్మాణాలు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. ఒక్కో దేవాలయాన్ని ఒక్కో శైలిలో రూపొందించగా, కొన్నింటిలో శిల్పాలు చూపరులను కట్టిపడేస్తాయి.