న్యాయంగా రావాల్సిన నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ ఆంధ్ర పాలకుల బుద్ధి మారడం లేదని... అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారాని ఆరోపించారు. ఓవైపు కృష్ణ మరోవైపు తుంగభద్ర నదులు ఉన్న నడిగడ్డ నీళ్ల కోస తీవ్ర ఇబ్బందులు పడిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలంలోని తక్కశిల రైతు వేదికలను. వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
ఒక్క చుక్క నీటిని కూడా వదలము...
ప్రాజెక్టులు నిర్మించాలంటే సరైన అనుమతులతో కొత్త ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నదిపై గల ఆర్డీఎస్ వద్ద కుడికాలును అక్రమంగా నిర్మిస్తోందని ఆరోపించారు. అక్రమంగా నీటిని తరలిస్తే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మనకు రావాల్సిన వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని తెలిపారు.