Illegal Mining in Gadwal District : భారత్ మాలలో భాగంగా మహారాష్ట్రలోని అక్కల్కోట నుంచి చెన్నై వరకు 15వ నెంబర్ జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని నందిన్నె నుంచి ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల వరకు 77 కిలోమీటర్ల పనులను ఓ ప్రముఖ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో నందిన్నె నుంచి జూలకల్ వరకు మొదటి దశలో భాగంగా 38 కిలోమీటర్ల మేర పనులు నడుస్తున్నాయి.
ఇష్టానుసారంగా గుట్టల్ని తవ్వేస్తున్నారు:ఈ పనులకు పెద్దఎత్తున మొరం, పలుగురాళ్లు, కంకర అవసరం. అందుకోసం రహదారి విస్తరిస్తున్న ప్రాంతాల్లో, గుట్టల్ని రోడ్డు నిర్మిస్తున్న కంపెనీ ఇష్టానుసారం తవ్వేసుకుంటూ వెళ్తోంది. మొరం రాళ్లు లాంటివి తవ్వుకుని వాడుకోవాలంటే, ముందుగా మైనింగ్, రెవెన్యూ సహా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే రహదారికి సమీపంలోని గుట్టల్ని సదరు కంపెనీ ఇష్టానుసారం తవ్వేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా: మైనింగ్, రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నప్పుడు కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి చర్యలేవీ లేకుండా నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ఆ దుమ్ము, ధూళీ సమీపంలోని పంటలపైకి చేరి.. పంటలు నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో విత్తన పత్తి, వేరుశనగ సహా ఇతర పంటలు వేశారు. మట్టి, రాళ్లు పంట పొలాలపై పడి తమ దిగుబడి వదులుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుట్టలపై రాళ్లను తవ్వేందుకు పేలుళ్లు జరుపుతున్నారు. అందుకు ఎలాంటి అనుతులు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. రాయికల్, వడ్డేపల్లి వద్ద నిబంధనలకు విరుద్ధంగా క్రషింగ్ యంత్రాలు ఏర్పాటు చేసి కంకర తయారు చేస్తున్నారు. దుమ్ము పడకుండా కనీసం నీటిని కూడా చల్లడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు, మూడు నెలల్లో జిల్లాలోని నందిన్నె నుంచి వడ్డేపల్లి వరకు పదుల సంఖ్యలో గుట్టలు పూర్తిగా కనిపించకుండా పోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
శాఖల అనుమతి లేకుండా: మట్టి, మొరం, రాళ్లు, ఇసుక లాంటివి తవ్వి వ్యాపార అవసరాల కోసం వాడుతున్నప్పుడు తప్పకుండా మైనింగ్, రెవెన్యూ సహా సంబంధిత శాఖల అనుమతి తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు మైనింగ్ శాఖ దృష్టికి రావడంతో, ఆ శాఖ నుంచి సదరు కంపెనీకి షోకాజ్ సహా డిమాండ్ నోటీసులు సైతం జారీ అయ్యాయి.