తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత స్నేహమే ఆ ఇద్దరి ప్రాణాలు తీసిందా...? - CRIME NEWS IN TELANGANA

డిగ్రీలో కలిసి చదువుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఫేస్​బుక్​లో కలిశారు. పాతమిత్రుడని ఆమె మాట్లాడితే అతి చనువు చూపాడు. ఫోన్లో మాట్లాడుకున్నారు. చివరకు ఏం జరిగిందో ఏమో... ఇద్దరు మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆ యువకుడు శవమయ్యాడు. మహబూబ్‌నగర్‌లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.

A MAN DIED IN GADWALA AND WOMEN SUICIDE IN MAHABOOBANAGAR
A MAN DIED IN GADWALA AND WOMEN SUICIDE IN MAHABOOBANAGAR

By

Published : Feb 29, 2020, 11:55 AM IST

పాత స్నేహమే ఇద్దరి ప్రాణాలు తీసిందా...?

గద్వాలకు చెందిన రాగసుధ (29)కు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. గతంలో గద్వాలలో కార్తీక్‌ అనే యువకుడు ఆమెతోపాటు డిగ్రీ చదువుకున్నాడు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఫేస్‌బుక్‌లో కలిశాడు. కొద్దిరోజులు స్నేహంగా మెలిగిన రాగసుధ అతని ప్రవర్తన నచ్చక మాట్లాడటం మానేసింది. అప్పటి నుంచి అతడు రాగసుధకు, ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడేవాడు.

ఫిబ్రవరి 24న కార్తీక్ అదృశ్యం

ఈ క్రమంలోనే ఈనెల 24 నుంచి కార్తీక్​ కనిపించకుండాపోయాడు. కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా... దర్యాప్తు చేపట్టారు. డిగ్రీలో కార్తీక్​తో కలిసి చదువుకున్న రవి, మరో యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతలోనే గద్వాల మండలం కొండపల్లి దగ్గర గుట్టల్లో నెట్టెంపాడు కాల్వ పనులు జరుపుతుండగా శుక్రవారం కార్తీక్‌ మృతదేహం దొరికింది. మూడ్రోజుల కిందటే అతడిని తలపై రాళ్లతో మోది చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన రాగసుధ

కార్తీక్​ మృతదేహం లభ్యమైనట్లు తెలిసి మహబూబ్‌నగర్‌లో ఉన్న రాగసుధ ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కార్తీక్‌ కారణమని లేఖ రాసి.. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది. కార్తీక్​ మృతి విషయంలో తనను కూడా విచారిస్తారన్న భయంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.

ఆ ఇద్దరి మృతికి కారణమేంటీ..?

మహబూబ్‌నగర్‌ వెళ్తున్నానని చెప్పి వెళ్లిన తమ కుమారుడు తిరిగి రాలేదని, ఓ అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని కార్తీక్‌ తల్లిదండ్రులు తెలిపారు. అమ్మాయి తరఫు వాళ్లు తమ ఇంటికి వచ్చి పలుమార్లు కార్తీక్‌ గురించి ఆరా తీశారన్నారు. కుమారుడు కనిపించడంలేదని రెండురోజుల క్రితమే పోలీసులకు చెప్పామన్నారు.

కార్తీక్‌ మృతికి, రాగసుధ ఆత్మహత్యకు సంబంధం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అతడి హత్యకు మహబూబ్‌నగర్‌ నుంచే పథకం రచించినట్లుగా పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో రెండు బృందాలతో విచారణ చేయిస్తున్నామని శనివారం వివరాలు వెల్లడిస్తామని జోగులాంబ గద్వాల డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details