Accidents in Telugu States Today : మహా శివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శైవక్షేత్రాలను దర్శించుకుని అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మానవపాడు మండలం కొర్విపాడు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థులు సాయిగౌడ్(15), శేఖర్ (15), ఇంటర్ విద్యార్థి రఫీ(16) మిత్రులు. వీరు శివరాత్రి సందర్భంగా అలంపూర్ ఆలయాలను దర్శించుకోవడానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు.
Alampur accident today: బైరాపురం సమీపంలోకి రాగానే ఇటిక్యాల మండలం నుంచి అలంపూర్‌కు కోళ్ల లోడుతో వస్తున్న బొలెరో వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన సాయి, రఫీ అక్కడికక్కడే మృతి చెందగా.. కొనఊపిరితో కొట్టుమిట్టాడిన శేఖర్ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలొదిలాడు. అంబులెన్సుకు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేదని, ఈ కారణంగానే శేఖర్ మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఎస్సై కుటుంబం బలి..: మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి ఎస్సై సమందర్‌వలి కుటుంబసభ్యులు, వారి బంధువులు ప్రయాణిస్తున్న కారు చినగంజాం నుంచి అద్దంకి వస్తుండగా వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం రహదారికి అవతలి వైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ఎస్సై భార్య, పాప, వారి బంధువులు, డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు దుర్మరణం చెందారు.