పల్లెప్రగతిలో చేపట్టిన పారిశుద్ధ్యం, హరితహారం, వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు.. వాటి వినియోగం, ఇంటి ఆవరణలో మొక్కలు నాటడం తదితర కార్యక్రమాల నిర్వహణలో ప్రగతి కనబర్చిన గ్రామాలను ప్రథమ, ద్వితీయ, తృతీయ, ప్రోత్సాహక బహుమతులు అందజేసేందుకు అధికారులు ఎంపిక చేశారు. కొన్ని జిల్లాల అధికారులు నగదు బహుమతులు అందజేయగా.. మరికొన్ని జిల్లాల్లో ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
ఉత్తమ పంచాయతీలు @ 76 - ఉత్తమ గ్రామపంచాయతీలకు అవార్డులు
మొదటి విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రామ పంచాయతీలను... అధికారులు ఉత్తమ పంచాయతీలుగా గుర్తించి నగదు, పోత్సాహక బహుమతులు అందించారు.
2019 సెప్టెంబరులో నిర్వహించిన మొదటివిడత పల్లెప్రగతి కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా 76 గ్రామాలను ఉత్తమమైనవిగా గుర్తించారు. ఈ గ్రామాలను ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకొని ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో 2020 జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ పంచాయతీలుగా అధికారులు ప్రకటించారు.
- నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎంపికచేసిన పంచాయతీలకు ప్రథమ, ద్వితీయ బహుమతుల కింద రూ.లక్ష, రూ.50 వేల చొప్పున ఇచ్చారు.
- నారాయణపేట జిల్లాలో మొదటి బహుమతి పొందిన పంచాయతీకి రూ.10 వేలు, రెండో బహుమతి కింద రూ.5 వేలు, మూడో బహుమతికి రూ.3 వేల చొప్పున ఎంపికచేసిన పంచాయతీలకు అందజేశారు.
- మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉత్తమ పంచాయతీల కింద ఎంపిక చేసిన గ్రామాలను ప్రశంసా పత్రాలతో అభినందించారు.
నారాయపేట జిల్లాలో మండలానికి మూడు గ్రామాల చొప్పున, మహబూబ్‌నగర్ జిల్లాలో మండలానికి రెండు ఉత్తమ గ్రామాలను గుర్తించారు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దిన అధికారులు, సర్పంచులను ఆయా జిల్లాల కలెక్టర్లు అభినందించారు. ఇందులో ముఖ్యప్రాత పోషించిన సర్పంచి, గ్రామ కార్యదర్శి, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారుల సేవలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.