పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా సింగరేణి సంస్థ దృష్టి సారిస్తోంది. ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రైలు మార్గం ద్వారా రవాణా చేయడానికి ఆసక్తి చూపుతోంది. దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని భావిస్తోంది. బొగ్గు గనుల నుంచి ఇతర ప్రాంతాలకు రైళ్లలో బొగ్గును తీసుకెళ్లడం ద్వారా కాలుష్యం పెరగకుండా ఉంటుందని యాజమాన్యం ఆలోచిస్తోంది. సింగరేణి సంస్థ ఏటా 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. ఇందులో కేవలం 10 మిలియన్ టన్నులు మాత్రమే రహదారి మార్గంలో తరలిస్తున్నారు. దీని వల్ల రహదారులపై బొగ్గు ధూళి లేవడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోంది. అంతే కాకుండా రహదారులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత వరకు రైలు మార్గంలోనే బొగ్గును రవాణా చేయాలని భావిస్తున్న యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంది.
పట్టాల మార్గం.. పర్యావరణ హితం - సత్తుపల్లి ఓసీపీ
భూపాలపల్లి నుంచి జమ్మికుంట వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని సింగరేణి ప్రతిపాదనలు చేసింది. సత్తుపల్లి ఓసీపీ నుంచి కొత్తగూడెం వరకు బొగ్గు రవాణా చేయడానికి 70 కిలోమీటర్ల మేర రహదారి మార్గంలో టిప్పర్ల ద్వారా తీసుకొస్తున్నారు. దీని వల్ల పర్యావరణం దెబ్బతింటుందని భావించిన యాజమాన్యం రైలు మార్గం కోసం ఆ శాఖతో మాట్లాడింది. ప్రస్తుతం సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు రైలు మార్గం పూర్తైతే.. భూపాలపల్లి నుంచి జమ్మికుంట వరకు పనులపై దృష్టి సారించే అవకాశం ఉంది.
ప్రస్తుతం జైపూర్ విద్యుత్తు కేంద్రానికి బొగ్గు రవాణా చేయడానికి 24 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని నిర్మించింది. దీనికి రూ.280 కోట్లు వెచ్చించింది. రామకృష్ణాపూర్ బొగ్గు బంకర్ నుంచి జైపూర్ విద్యుత్తు కేంద్రానికి రైలు మార్గం ద్వారానే బొగ్గును తరలిస్తోంది. గతంలో 24 కిలోమీటర్ల మేర లారీల ద్వారా బొగ్గు తరలించడం వల్ల ప్రమాదాలతో పాటు బొగ్గు ధూళి పెరిగింది. దీన్ని నివారించేందుకు రైలు మార్గం నిర్మించారు. అలాగే సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వరకు కూడా కొత్త రైలు మార్గాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం పనులు సాగుతున్నాయి.
ఇదీ చూడండి :తెలంగాణలో ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత