Investigation by Vigilance Officers at KTPP : కేటీపీపీలోని స్టోర్ రూమ్‌లోని విద్యుత్ సామగ్రి, రాగి తీగలు, విడిభాగాలు మాయమైన ఘటనపై విజిలెన్స్ శాఖ దృష్టి సారించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు కేటీపీపీలోని స్టోర్ రూమ్‌లో కొంత సామాగ్రి మాయమైన విషయం తెలిసిందే.. వీటి విలువ సుమారు రూ. 80 లక్షలుగా ఉంటుందని జెన్‌కో విజిలెన్స్ ఉన్నతస్థాయి అధికారులు గుర్తించారు.
విచారణ కోసం ఉన్నత స్థాయి విజిలెన్స్ బృందాన్ని జెన్‌కో పంపించగా.. సంబంధిత అధికారులను విచారించారు. కేేటీపీపీలోని అన్ని సీసీ కెమెరాలను వారు పరిశీలించారు. అంత సెక్యూరిటీ ఉన్న.. సామాగ్రి ఎలా మాయమైందనే విషయంపై కూఫీ లాగుతున్నారు. ఈ తతంగంలో ఆరుగురు ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సెక్యూరిటీ అధికారులు అర్ధరాత్రి వేళ ఒక వాహనాన్ని సోదాలు చేయకుండా బయటకు పంపించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ రోజు విధుల్లో ఎవరు ఉన్నారోనని అధికారులు అడిగి తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రతి ఒక్క వ్యక్తిని తనిఖీ చేసి పంపించే సిబ్బంది.. ఆ ఒక్క వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయకుండా బయటకు పంపడంపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అధికారులు ఎవరైనా సహాయం చేసి ఉంటారా అన్న కోణంలో విచారణ రహస్యంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.