TS TRNASCO CMD helped Three orphan Kids in Bhupalpally : ఆత్మీయులను కోల్పోయిన ఆ ముగ్గురు చిన్నారులకు ఓ గూడు దొరికింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారి.. గుడారంలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన చిన్నారులకు ఎట్టకేలకు సాయం అందింది. వారి జీవన పరిస్థితులపై ఈటీవీ- భారత్‌లో ప్రచురితమైన "అమ్మానాన్న లేరు.. ఆపదలో ఉన్నాం.. ఎవరైనా మమ్మల్ని ఆదుకోండయ్యా" శీర్షిక కథనానికి దాతలు స్పందించి రూ. 2లక్షలతో ఇంటిని నిర్మించారు. చిన్నారులతో గృహప్రవేశం చేయించారు.
అసలు స్టోరీ ఏంటంటే..ముగ్గురు చిన్నారుల తల్లిదండ్రులిద్దరూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారి తల్లి అనంత ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఎనిమిదేళ్లు క్రితం ఆత్మహత్య చేసుకుంది. కొంత కాలానికి వారి తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వారికి పూట గడవడమే కష్టంగా మారిపోయింది. అందువల్ల రాజ్‌కుమార్(16), రష్మిక(15) కూలీ పనికి వెళ్లాల్సి వచ్చింది. మూడో వాడైన రంజిత్(12)ని గిరిజన పాఠశాల్లో చేర్పించి చదివిస్తున్నారు. ఇలా రోజులు గడుస్తుండగా.. వారి తండ్రి బాపు(42) కొన్ని నెలల క్రితం మరణించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ముగ్గురు అనాథలైపోయారు. ఉండేందుకు ఇల్లు లేక చిన్న గుడారం వేసుకుని జీవిస్తున్నారు. వారికి బంధువులు ఉన్నా సాయం చేయలేని పరిస్థితి.
ఎవరూ లేక ఒంటరై.. సాయం కోసం ఎదురుచూస్తూ.. జామ చెట్టు కిందే జీవనం
Vidyut accounts officers association built a house for orphan kids :వారి దీన స్థితిపై మే 29వ తేదీన ఈటీవీ భారత్‌లో 'అమ్మనాన్న లేరు ఆపదలో ఉన్నాం.. ఎవరైనా మమ్మల్ని ఆదుకోండయ్యా' అనే శీర్షికతో కథనం ప్రచురిత మైంది. ఈ విషయం తెలుసుకుని తెలంగాణ విద్యుత్ శాఖ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు స్పందించారు. వెంటనే ఆయన చిన్నారులకు సాయం చేయాలని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు సూచించారు. ప్రభాకర్ రావు సూచన మేరకు ఆ అసోసియేషన్ చిన్నారుల బాధ్యతను తీసుకుంది. తక్ష ణమే నిత్యావసర సరకులు, సామగ్రి ఇచ్చి ఆదుకుంది. అంతటితో ఆగకుండా సుమారు రూ.2 లక్షల వ్యయంతో నెల వ్యవధిలోనే ఇంటిని నిర్మించి చిన్నారులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. తాజాగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య చిన్నారులతో మాట్లాడారు. వారి సమస్యను తెలుకున్నారు. రంజిత్, రాజకుమార్, రష్మికలతో గృహప్రవేశం చేయించారు.