తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్కంపేటలో అభివృద్ధి జాడేది... ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలే' - Telangana News

Revanth Reddy Letter To Cm Kcr: సీఎం కేసీఆర్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి లేఖ రాశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నిన్న ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను సందర్శించిన ఆయన.. అక్కడి పరిస్థితులను అందులో వివరించారు. తక్షణమే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : May 22, 2022, 3:06 PM IST

Revanth Reddy Letter To Cm Kcr: తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా... జయశంకర్ స్వగ్రామంలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కానరావడంలేదన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు అక్కంపేట గ్రామాన్ని సందర్శించి ఊరు బాగుకోసం ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయని విమర్శించారు.

కనీస సదుపాయలు కరవు: కనీస మౌలిక సదుపాయాలు కూడా అక్కంపేట గ్రామం నోచుకోకపోవడం దురదృష్టకరమని రేవంత్​ అన్నారు. ఇప్పటికీ రెవెన్యూ విలేజ్‌ హోదా ఇవ్వకపోవడం అత్యంత విచారకరమని తెలిపారు. అక్కంపేట ఇప్పటికీ పెద్దాపూర్ గ్రామ పరిధిలోనే కొనసాగుతుండటం క్షమించరాని అంశమని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా అక్కంపేటలోని నిరుపేద దళితుడు చిలువేరు జానీ కుటుంబంతో కలిసి భోజనం చేశానని... చాలా దీనమైన పరిస్థితుల్లో కుటుంబం జీవనం సాగిస్తోందన్నారు. వారికి కనీసం సొంత ఇళ్లు సైతం లేదని తెలిపారు.

వారి జీవితాల్లో మార్పేది: దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్​రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తూ జయశంకర్ సార్ సొంత గ్రామంలో అభివృద్ధి లేదంటే పల్లె ప్రగతిలోని డొల్లతనం అర్ధమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే అక్కంపేటలో ప్రొఫెసర్ జయశంకర్ పేరిట స్మృతివనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ల్యాండ్ పూలింగ్ ఆపాలి: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు కోసం కాకతీయ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ (కుడా) ల్యాండ్ పూలింగ్ విధానంలో పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధమైందన్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వెనక్కి తీసుకుంటున్నట్లు కింది స్థాయి నాయకులు చేస్తున్న ప్రకటనలు రైతుల్లో విశ్వాసం నింపడం లేదన్నారు. ఈ నేఫథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో సంబంధిత జీవోను వెనక్కి తీసుకుంటునట్లు మీరు స్పష్టమైన ప్రకటన చేస్తే వారిలో ఆందోళన తగ్గి నిశ్చితంగా ఉంటారని తెలిపారు. లేకుంటే ఆ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ఉద్యమిస్తుందని... ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే దాకా పోరాటం సాగిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details