భూపాలపల్లిలో రేవంత్‌రెడ్డి బహిరంగ సభ వద్ద ఉద్రిక్తత Tension at Revanthreddy Bhupalapally Meeting: ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర సందర్భంగా మంగళవారం రాత్రి భూపాలపల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాశీంపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేసిన రేవంత్‌రెడ్డి... భూపాలపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న క్రమంలో స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు వందమంది సభ వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుని పక్కనే ఉన్న సినిమా థియేటర్లో నిర్బంధించి ఉంచి గేట్లు మూసేశారు. అయినా కూడా ఆగని బీఆర్ఎస్ కార్యకర్తలు సభ జరుగుతున్న ప్రదేశం పైకి రాళ్లు, కోడి గుడ్లతో దాడులు చేశారు. వెంటనే సభ వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, సినిమా థియేటర్ లోపల ఉన్న బీఆర్ఎస్ శ్రేణులతో రాళ్లు, సీసాలతో దాడులు చేశారు. పరస్పరం ఒకరికొకరు రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసుకోవడంతో పది నిమిషాలు పరిస్థితి రణరంగంగా మారింది.
ఎస్‌ఐ తలకు తీవ్ర గాయాలు : రాళ్ల దాడిలో పక్కనే ఉన్న సినిమా థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దాడులుచేస్తే సహించేది లేదని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ ముగిసిన అనంతరం రేవంత్‌రెడ్డి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్ధుమణిగింది. ఘటనలో కాటారం ఎస్‌ఐ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
దొరగడీలో గడ్డి తినేందుకు ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించారు : తెలంగాణ రాష్ట్రం దోపిడీ దొంగల చేతిలో బందీ అయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ల్యాండ్, సాండ్, లిక్కర్ మాఫియా చేతిలో తెలంగాణ లూటీ అవుతోందని మండిపడ్డారు. కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించారని రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు.
'మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించిన సన్నాసులకు బుద్ది చెబుదాం. మా సభ మీద ఈరోజు వంద మందిని తీసుకొచ్చి దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నావా? నేను తలచుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. ఒకే రోజు రెండు పార్టీలు సభ పెట్టకూడదని మేం ఆ రోజు మా జోడో యాత్రకు విరామం ఇచ్చాం. నేడు ఆవారా గాళ్లు దాడులు చేస్తే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తారా? ఎస్పీ, ఎమ్మెల్యే చుట్టమనే ఇలా వ్యవహరించారా?'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఒకవైపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న రేవంత్‌రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. తాము అధికారంలోకి వస్తే చేసే హామీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500 వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు సాయం అందిస్తామని పేర్కొన్నారు. భూపాలపల్లి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కార్యకర్తలకు సూచించారు. ఉద్రిక్తతల నడుమ రేవంత్‌రెడ్డి ప్రసంగం పూర్తి చేసి వెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.
ఇవీ చదవండి: