Telangana Government Action on Medigadda Barrage : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగిన అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణ వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జ్(Sitting Judge Hearing on Medigadda Damage)తో న్యాయవిచారణ జరిపించి బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా సీఎం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఆనకట్టకు సంబంధించి తదుపరి కార్యాచరణ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకురావాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం సూచించారు.
మేడిగడ్డ మరమ్మతుల భారాన్ని తాము భరించబోమని ఎల్అండ్టీ(L&T Reaction on Medigadda Damage) స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. వారితో పాటు నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో మంత్రి ఉమ్మడి సమావేశం నిర్వహించి అన్ని అంశాలపై లోతుగా సమీక్షించారు. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌పై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Irrigation Minister Fire on Representatives of L&T: నీటిపారుదలశాఖ ఇచ్చిన డిజైన్ ఆధారంగా తాము నిర్మాణం చేశామని ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పారు. ఇంజినీర్లు రూపొందించిన డిజైన్లను ఎవరైనా పరిశీలించారా అని మంత్రి ఈఎస్‌సీలను ప్రశ్నించారు. అంత పెద్ద ఆనకట్ట డిజైన్‌ను థర్డ్ పార్టీ తనిఖీ చేయకుండా ఎలా నిర్మిస్తారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Fire on L&t Representative) నిలదీశారు. ఇసుకపై భారీ నిర్మాణంఎలా నిలుస్తుందని అనుకున్నారని ప్రశ్నించారు. ఇంజినీర్లకు బాధ్యత లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్‌ను ఏ మాత్రం పరిశీలించకుండా నిర్మాణం ఎలా చేపట్టారని ఎల్అండ్టీ ప్రతినిధులను మంత్రి ఉత్తమ్ అడిగారు.
మేడిగడ్డ నిర్మాణ అంశంలో ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని ఉత్తమ్‌కుమార్ హెచ్చరించారు. ఘటన జరిగి రెండు నెలలవుతుందని ఇప్పటి వరకు ఏం తేల్చారని ప్రశ్నించారు. ఈ దిశగా అప్పటి ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆయన సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.