తెలంగాణ

telangana

ETV Bharat / state

సరిహద్దుల్లో అక్రమ రవాణా.. మాఫియాగా ఏర్పడి కలప దోపిడి - take wood smugging news

గోదావరి పరివాహకంలో కలప స్మగ్లర్లకు ఎదురులేకుండా పోయింది. నిఘా నిస్తేజంతో నిరంతరాయంగా అక్రమ రవాణా కొనసాగుతోంది. అనధికారిక ఫెర్రీలు, వాహనాలతో దందా బహిరంగ రహస్యాన్ని తలపిస్తోంది. అక్రమార్కుల లోగుట్టు.. యంత్రాంగానికి తెలిసినా ఏమీ పట్టనట్లు ఉండటం అనుమానాలకు దారి తీస్తోంది. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని వెంకటాపురం, పలిమెల, ఏటూరునాగారంలలో కలప అక్రమ రవాణా దండిగా కొనసాగుతోంది.

takewood illegal smuggling in jayashankar bhupalapally district
సరిహద్దుల్లో అక్రమ రవాణా.. మాఫియాగా ఏర్పడి కలప దోపిడి

By

Published : Dec 4, 2020, 2:25 PM IST

ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని వెంకటాపురం, పలిమెల, ఏటూరునాగారం ఉత్తర అటవీ రేంజిలు గోదావరి పరివాహకంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర అభయారణ్యాలకు చెంతనే ఉండటంతో కలప అక్రమ రవాణా ఈ మార్గాల ద్వారా సరిహద్దులు దాటుతోంది. ఆ రాష్ట్రాల్లోని టేకు దుంగలను సులభంగా సేకరిస్తున్న అక్రమార్కులు సునాయాసంగా ఎదిర, ఆలుబాక, లెంకలగడ్డ, దమ్మూరు, సర్వాయిపేట అటవీ సెక్షన్లు చిరునామాగా అక్రమ రవాణాకు ఒడిగడుతున్నారు. తక్కువ ధరకే టేకు లభ్యమవుతుండటంతో దొడ్డిదారిన తరలించి దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

కాసులు కురిపిస్తున్న స్మగ్లింగ్‌

సరిహద్దుల్లో కలప అక్రమ రవాణా స్మగ్లర్లకు కాసులు కురిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో అక్రమ రవాణాపై నియంత్రణ లేకపోవడంతో మాఫియా రాజ్యమేలుతోంది. ఆ రాష్ట్రంలో దొడ్డిదారిన లభ్యమయ్యే 7 అడుగుల పొడవు, 9 అంగుళాల మందం, 9 అంగుళాల వెడల్పుతో ఉండే దుంగ రూ.2000 నుంచి రూ.2500 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రవాణాదారులు, ట్రాక్టర్ల ద్వారా వెంకటాపురం, ఏటూరునాగారం, భూపాలపల్లి, మంథనితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూపతిరావుపేట, మణుగూరు, పినపాక ప్రాంతాలకు చేరవేస్తున్నారు. అక్కడ రూ.4వేల నుంచి రూ.4500 విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌లో 18 దుంగలను తరలిస్తున్నారు. వీటి విలువ రూ.లక్షకు పైగా ఉంటుంది.

చెక్‌పోస్టుల ఏర్పాటుతోనే అడ్డుకట్ట

కలప అక్రమ రవాణా ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కొత్తపల్లి అభయారణ్యం నుంచి కొనసాగుతున్న స్మగ్లింగ్‌ ఆలుబాక, విజయపూరికాలనీ, ఎదిర, సుబ్బంపేట సమీప ఫెర్రీల ద్వారా ఆవలికి చేరుతోంది. ఇక్కడి మూడు మార్గాలను అక్రమార్కులు ఎంచుకుని చీకటిమాటున ఇసుక తిన్నెల్లోకి చేర్చుతున్నారు. రాత్రికి రాత్రే పడవల ద్వారా భూపతిరావుపేట, టి.కొత్తగూడెం, అక్కినపల్లి మల్లారానికి దాటవేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో అటవీశాఖ మెరుపుదళంతో పాటు ప్రత్యేక బృందాలతో నిరంతరం నిఘా పెడితేనే అక్రమాలకు చెక్‌పడనుంది.

తెరవెనుక సూత్రధారులు..!

వెంకటాపురం అటవీ క్షేత్రంలో ఓ ఇద్దరు కలప మాఫియాను నడిపిస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం టి.కొత్తగూడేనికి చెందిన ఆ వ్యక్తులు ఇక్కడ అక్రమ రవాణాలో ఆరితేరారు. ఓ వ్యక్తి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కొత్తపల్లి కేంద్రంగా ట్రాక్టర్‌ ద్వారా కలప తెస్తుండగా.. మరో అక్రమార్కుడు ఎదిర, ఆలుబాక, సూరవీడు ప్రాంతాల్లో గోదావరి దాటించేందుకు పడవలను సమకూర్చుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరికి ఈ ప్రాంతంలోని అణువణువూ తెలిసిన ఓ వ్యక్తి, ఓ ప్రభుత్వ ఉద్యోగి భర్త సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు సంబంధించిన ట్రాక్టరును సైతం అద్దెకు ఏర్పాటు చేసి కలప అక్రమానికి చేదోడుగా ఉంటున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమార్కులు చిట్టా అంతా అటవీశాఖలోని క్షేత్రస్థాయి యంత్రాంగానికి తెలిసినా మిన్నకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

సంయుక్తంగా కట్టడికి ప్రణాళిక

కొత్తపల్లి కేంద్రంగా కలప అక్రమ రవాణాపై అన్వేషణ చేస్తున్నాం. ఈ దందా వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది ఆరా తీస్తున్నాం. ప్రత్యేక పరిస్థితులు ఉన్న ప్రాంతం కావడంతో పోలీస్‌శాఖను సమన్వయం చేసుకుని సంయుక్తంగా అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తు తరాలకు ఉపయుక్తమైన కలపను అక్రమార్కుల నుంచి కాపాడేందుకు ప్రజలు సైతం సహకరించాలి.

- గౌతమ్‌రెడ్డి, ఇన్‌ఛార్జి ఎఫ్‌ఆర్‌వో

ఇదీ చదవండి:సర్క్యులర్‌ అమలును నిలిపివేయండి:హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details