తెలంగాణ

telangana

ETV Bharat / state

మదర్స్​ డే: కరోనాకు అమ్మ చికిత్స.. ధైర్యం, మమకారం - mothers services to family in corona pandemic time

కరోనా కష్ట కాలంలోనూ మాతృమూర్తులు ఇంటికి పెద్దదిక్కుగా నిలిచారు. తాను, కుటుంబం కరోనా బారిన పడ్డా కళ్లలోని కన్నీరు బయటకు కనిపించకుండా ధైర్యంతో సేవలందించారు. వైరస్‌ను జయించారు. ఇంటికి పెద్ద దిక్కుగా బిడ్డలు, ఇతర కుటుంబ సభ్యులు కొవిడ్‌ బారిన పడకుండా కునుకు లేకుండా పనిచేశారు. వైద్యురాలిగా మందులు అందించారు. అమ్మగా కడుపునిండా పోషకాహారం ఇచ్చారు. ఇలా ఎందరో తల్లులు ఇంటికి దన్నుగా నిలిచి సేవలందించారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా ఇలా సేవలందించిన మాతృమూర్తుల విజయగాథలతో కథనం.

mothers services in corona time
కరోనా సమయంలో తల్లుల సేవలు

By

Published : May 9, 2021, 12:38 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా దేవరుప్పులకు చెందిన బుక్కా అనంత లక్ష్మి భర్త రామయ్య మధుమేహ బాధితుడు. నిత్యం సకాలానికి అవసరమైన మందులు అందించడంతో పాటు వేళకు తగు ఆహారం అందించడం సాధారణమైంది. ఈలోగా కరోనా సోకిందని తేలింది. ఇంటిల్లిపాదీ కంగారు పడ్డారు. ఇంట్లో పిల్లలకు సోకకుండా చూసుకోవాలనుకున్నారు. కడుపులో గంపెడు భయం ఉన్నా ఏమాత్రం తొణకలేదు. అందరికీ ధైర్యం చెప్పారు. ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. తాను భయపడితే ప్రయోజనం ఉండదనుకుని కళ్లలో నీరు ఇంకేదాక ఏడ్చి పెద్దదిక్కుగా నిలిచింది.

దగ్గరుండి మందులు, పోషకాహారం అందించాను

"నా భర్తకు ధైర్యం చెప్పి ఇంట్లోనే వైద్యం అందించాను. పిల్లలను ఎటూ వెళ్లకుండా వారు నిత్యం మాస్కులు ధరించేలా, శానిటైజర్‌ వాడేలా చూసుకున్నా. భర్తను పిల్లలకు దూరంగా ఏకాంతంగా గదిలో ఉంచి గది బయట కూర్చుని పురాణేతిహాసాల పుస్తకాలు చదివి ఉల్లాసం కలిగించా. ఎక్కడా ధైర్యం చెడకుండా ఇంటిల్లిపాదినీ కాపాడుకోగలిగాను."

- బుక్కా అనంతలక్ష్మి, దేవరుప్పుల

అమ్మసేవలు మరవలేం..

"మా ఇంట్లో నాతోపాటు అమ్మానాన్నలకు, అన్నయ్యకు పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. అందరం ఆందోళన చెందాం. కానీ అమ్మ శ్రీదేవి మాలో మనోధైర్యాన్ని నింపారు. కంగారు పడాల్సిన అవసరం లేదంటూ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. వేళకు మందులు వేయించేవారు. ఆవిరి పట్టించడం, పండ్లరసాలు తాగించడం, వేళకు భోజనం తయారు చేయడం, ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. పోషకాహారం అందించారు. అమ్మకు పాజిటివ్‌ వచ్చినా ధైర్యం కోల్పోలేదు. మేమందరం త్వరగా కోలుకునేలా అమ్మ తీసుకున్న జాగ్రత్తలు మరవలేం. ఇప్పుడు అందరికీ నెగెటివ్‌ వచ్చింది. సంతోషంగా ఉన్నాం."

-సౌమ్య, మల్లారం, మల్హర్‌ మండలం

పిల్లలకు ధైర్యం చెప్పి దూరంగా ఉంచాం ..

"తొలుత నాకు, ఆనక నా భర్తకు కరోనా సోకిందని ఫలితాలు తేల్చి చెప్పడంతో ఒకింత కంగారు పడ్డాను. నిత్యం పొలం దగ్గరకు వెళ్లాల్సి రావడం, కూలీలతో కలిసి పనిచేయాల్సిన రోజులు. కరోనా సోకిందని తెలియగానే కూలీలకు రావద్దని మేం కూడా ఇల్లుదాటి బయటకు వెళ్ళవద్దని నిర్ణయించుకున్నాం. దగ్గరి బంధువులకు విషయం చెప్పి మా ఇద్దరు పిల్లలను వారి ఇంటికి పంపించాను. నిత్యావసర సరకులు సమీప బంధువులు తెచ్చి ఇంటిముందు పెడితే తీసుకున్నాం. పిల్లలతో తరచూ మాట్లాడుతూ ధైర్యం చెప్పాం. మేం ఇద్దరం ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ గడిపాం. వైద్యుడికి తరచూ ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి వివరించి మందులు మంచి ఆహారం తీసుకుంటూ గడిపాం. భయపడితే ప్రమాదం తప్ప మరేం నష్టం జరగదు. సకాలంలో గుర్తించి మంచి వైద్యం తీసుకుని ధైర్యంగా గడిపాం."

-గోలి మమత, దేవరుప్పుల

బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు..

"మా ఇంట్లో నాతోపాటు నా భర్త, ఇద్దరు పిల్లలకు పాజిటివ్‌ వచ్చింది. ధైర్యంగా ఎదుర్కొన్నాం. భయపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. వైద్యులు సూచించిన మందులను భర్తతోపాటు, పిల్లలకు వేయించాను. ఉదయం, సాయంత్రం ఆవిరి పట్టించడం. పండ్ల రసాలను చేయించి తాగించాను. డ్రై ఫ్రూట్స్‌ తీసుకున్నాం. పిల్లలు తోటివారితో ఆడుకునేందుకు వెళ్తామన్నా, వారికి నచ్చజెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నాను. ఇంటి వద్దే అందరం కోలుకున్నాం. భయపడకుండా వైద్యుల సూచనలు పాటించాలి."

- న్యాతకాని మమత, నీరుకుల్ల, ఆత్మకూరు మండలం

పిల్లలను సంతోషంగా ఉంచుతూ..

ధైర్యం కోల్పోతే కరోనా సోకిన చిన్నారులు ఇంకా భయపడతారని భావించి వారిని నిత్యం సంతోషంగా ఉంచి వైరస్‌ బారి నుంచి కాపాడానంటున్నారు తొర్రూరుకు చెందిన ఉపేంద్ర. కుమార్తెలు ఆరాధ్య(5), ద్రాక్షాయణి(3) కరోనా బారిన పడ్డారు. వైద్యుల సూచనతో పండ్లు, గుడ్లు వంటి పోషకాహారం అందిస్తూ మందులు నిత్యం వాడాం. అమ్మా ఈ మందులు ఎందుకే అంటే వారికి జ్వరమొచ్చిందని అసలు విషయం తెలియకుండా నిత్యం సంతోషంగా ఉంచా. ఉదయం సాయంత్రం ఆవిరి పట్టడంతోపాటు వెల్లుల్లి, వేడి నీళ్లు తాగించడం, పాలలో పసుపు కలిపి పిల్లలకు తాగించడంతో వారంలో వారు పూర్తిగా కోలుకున్నారు. భర్త శ్రీనివాస్‌ కూడా ధైర్యంగా సేవలందించారు.

ఇదీ చదవండి:ప్రాణదాతలు.. ప్లాస్మా వీరులు

ABOUT THE AUTHOR

...view details