తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్​ కొలువు వదిలి... సేంద్రియ సాగు వైపు.. - యువరైతుపై కథనం

కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం వదిలేసి ఓ యువకుడు వ్యవసాయం వైపు మళ్లారు. ఏకంగా 110 రకాల దేశీయ వరి వంగడాలను సేంద్రియ విధానంలో సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచారు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ భాస్కర్‌.

special story on young farmer Golconda Bhaskar from Rajakkapally, Jayashankar‌ Bhupalpally District
కార్పొరేట్​ కొలువు వదిలి... సేంద్రియ సాగు వైపు..

By

Published : Feb 10, 2021, 8:06 AM IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాజక్కపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ భాస్కర్​ కార్పొరేట్​ సంస్థలో ఉద్యోగం చేసేవారు. రాత్రి పూట ఉద్యోగం, పని ఒత్తిడి, తదితర కారణాలతో అయిష్టంగానే హైదరాబాద్‌లో ఐదేళ్లపాటు వివిధ రకాల కార్పొరేట్‌ ఉద్యోగాల్లో కొనసాగిన ఆయన... ఓ రోజు యూట్యూబ్‌లో పాలేకర్‌ సేంద్రియ వ్యవసాయ పద్ధతులు చూశారు. నచ్చడంతో సాగుపై దృష్టి సారించారు. ఇంట్లో భార్య, తల్లిదండ్రులను ఒప్పించి తొలుత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ ఎరువుల తయారీ నేర్చుకున్నారు.

అందరి కంటే భిన్నంగా ఉండాలని పూర్తిగా 110 రకాల స్వదేశీ వరి వంగడాలను సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గురువు శివప్రసాద్‌ వద్ద సేకరించారు. తనకున్న రెండెకరాల్లో సిద్ధ సన్నాలు వేశారు. మిగతా అర ఎకరంలో 110 రకాల విత్తనాలను వేశారు. ఒక్కో రకాన్ని రెండు వరుసల చొప్పున సాగు చేశారు. రక్తశాలి, కుల్తాఖర్‌, పుంగార్‌, కర్పూకౌవుని, మైసూర్‌ మల్లిగ, చింతలూరు, కుజీపటాలీయా, ఇంద్రాణి, నవార, రామ్‌ జీరా, ఘని, రత్నచోడి, సిద్ధసన్నాలు, గురుమట్టియా, మడమురంగి, కెంపు సన్నాలు, దూదేశ్వర్‌, నారాయణకామిని, బర్మాబ్లాక్‌, బర్మాబ్లాక్‌లాంగ్‌, బాసుమతి, వెదురుసన్నాలు, కామినిభోగ్‌, కాలాబట్టి, కాలాబట్‌ లాంటి వరి రకాలను సాగుచేశారు.

సేంద్రియ ఎరువులతోనే..

సేంద్రియ ఎరువులు, జీవామృతం, సహజ సిద్ధమైన ఎరువులను మాత్రమే వాడారు. ఇతర రైతుల పంటలకు చీడపీడలు పట్టినా ఆయన చేలో మాత్రం అవి దరి చేరలేదు. తేడా గమనించిన రైతులు ఆ వంగడాలు తమకు కావాలని కోరడంతో ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పంట సాగు చేసిన రైతులు తిరిగి కొన్ని వడ్లు తనకు ఇవ్వాలని నిబంధన పెట్టారు. అలా ఇచ్చిన వడ్లను మరికొంత మందికి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతున్నారు భాస్కర్‌. ప్రస్తుత మార్కెట్‌లో సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యం రూ. 150 నుంచి రూ.500 వరకు ధర పలుకుతోంది. సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన సిద్ధసన్నాలు ధాన్యాన్ని క్వింటాలు రూ.5వేల చొప్పున విక్రయించారు.

స్వదేశీయ వంగడాల అభివృద్ధే లక్ష్యం

హైదరాబాద్‌లో ఓ స్టార్‌ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తూ యూట్యూబ్‌లో పాలేకర్‌ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను చూశాను. రసాయన ఎరువులు, పురుగు మందుల మూలంగా అనారోగ్యం పాలవుతున్నట్లు తెలుసుకున్నా. అదే సమయంలో ఏకలవ్య స్వచ్ఛంద సంస్ధ ఆధ్వర్యంలో కొన్ని సేంద్రియ వ్యవసాయ పద్ధతులు నేర్చుకున్నా.

స్వదేశీ వంగడాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న శివప్రసాద్‌ వద్ద కొంత కాలం మెలకువలు నేర్చుకుంటూ ఆయన వద్ద ఉన్న 110 రకాల వరి విత్తనాలను సేకరించాను. వచ్చిన ధాన్యాన్ని ఆసక్తి ఉన్న రైతులకు ఉచితంగా ఇచ్చాను. కనుమరుగవుతున్న దేశీయ వంగడాలను పూర్తి సేంద్రియ పద్ధతిలో రైతులు సాగు చేసేలా చూడాలనేదే నా లక్ష్యం.

- గోల్కొండ భాస్కర్‌, యువ రైతు

ABOUT THE AUTHOR

...view details