క్రీస్తుశకం 1156-1234 సంవత్సరాల మధ్యకాలంలో గణపతి దేవుడి పాలన సమయంలో నిర్మించిందే కోటగుళ్లు దేవాలయం. కోటగుళ్లు త్రిబుల్ టి-టౌన్, టెంపుల్, ట్యాంక్ సూత్రం ఆధారంగా గణపతి దేవుడి సామంతరాజు అయిన గణపతి రెడ్డి నిర్మించాడని చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. కాకతీయ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడైన రేచర్ల గణపతి రెడ్డి దీనిని నిర్మించి గణపేశ్వరాలయంగా నామకరణం చేశారు. ఇందులోని ప్రతి శిల్పం జీవకళ ఉట్టిపడేలా చెక్కించారు. ప్రతి శిల్పం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటాయి. ఈ ఆలయం అంటే రుద్రమదేవికి కూడా ఇష్టమని చెబుతారు. ఆమెకు చిహ్నంగా ఆలయం చుట్టూ గజకేసరులను ఏర్పాటు చేశారు. గర్భాలయంలో శివలింగం ఎంతో చూడముచ్చటగా.. ప్రకాశవంతంగా ఉంటుంది.
దిల్లీ సుల్తానులు దండెత్తిన సమయంలో ఆలయ గోపురం పైకప్పు, నంది విగ్రహం, ఇతర శిల్పాలు ధ్వంసమయ్యాయి. దీంతోపాటు చాలా రోజుల నుంచి నిర్వహణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. 2002లో ఆలయ పునరుద్ధరణలో భాగంగా జరిగిన తవ్వకాల్లో ద్వారపాలకులు, వినాయకుడు, ఆంజనేయుడు, భైరవుని ఆకారంలో రెండు విగ్రహాలు ఇతర నల్లరాతి విగ్రహాలు బయటపడ్డాయి. ఇప్పటికీ వాటిని హరిత హోటల్ సమీపంలో ఆరు బయటే ఉంచారు.
నిధులు కేటాయించారు.. విడుదల మరిచారు..
2019 సంవత్సరంలో పునరుద్ధరణ పనులు చేపట్టినా.. ముందుకు సాగలేదు. రూ.45 లక్షలతో ప్రహరీని నిర్మించారు. ప్రధాన ఆలయం మరమ్మతుకు మరో రూ.15 లక్షలు వినియోగించారు. మొత్తం పనులకు రూ.2 కోట్లను కేటాయించినా.. నిధులు విడుదల కాకపోవడంతో ఆలయ అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా తీసిన శిల్పాలు ఆరు బయట వేశారు. పునరుద్ధరణ పనులు జరగకపోవడంతో శిల్పాలు ఆరు బయట వానకు నానుతూ, ఎండకు ఎండుతూ శిథిలమవుతున్నాయి. తిరిగి నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఇక్కడ నిర్మించిన హరిత హోటల్ కూడా వినియోగంలో లేదు. నిధులు విడుదల కాకపోవడంతోనే పనులు చేపట్టడం లేదని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.