Roads Damage: భారీ వర్షాలకుతోడు గోదావరి వరదలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. పలిమెల, పంకన, లెంకలగడ్డ, నీలంపల్లి, సర్వాయిపేట, దమ్మూరు, ముకునూరు గ్రామాల్లోకి వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో ఊళ్లు వదిలిపోయారు. వరద తగ్గటంతో ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు.. ఉన్నదంతా పోవటంతో గుండెలు బాదుకుంటున్నారు. ఇంట్లోని సామగ్రి తడిసిపాడవటంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పశువులు, కోళ్లు కొట్టుకుపోయాయి. సుమారు 2 వేల ఎకరాల్లోని పత్తి పంటలు నీట మునిగాయి. పెద్దంపేట వాగు వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు ధ్వంసం కావడం పలిమెల మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు కామారెడ్డి జిల్లాలో రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ఉద్ధృతికి చాలాచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా వర్షాలకు 52.85 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు ధ్వంసం కాగా రూ.13 కోట్ల మేర నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 44 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మద్నూర్ నుంచి జుక్కల్ మండలానికి 20 కోట్లతో రెండేళ్లక్రితం వేసిన రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. మరికొన్నిచోట్ల వర్షాలకు రోడ్డుపక్కన మొరం కొట్టుకుపోయింది. జుక్కల్ మండలం హంగర్గ సమీపంలో వర్షానికి కల్వర్టు కొట్టుకుపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మద్నూర్ మండలం సిర్పూర్ వాగుపై 35 లక్షలతో నిర్మించిన వంతెన వరదలకు కొట్టుకుపోయింది. మద్నూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, పెద్ద కొడప్‌గల్ మండలాల్లో రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వరద బాధిత ప్రాంతాల ప్రజల కోరుతున్నారు.