Kaleshwaram Project record level Inflow : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ధాటికి పుష్కరఘాట్లు మునిగిపోయాయి. అనంతరం రోడ్లపైకి.. ఆ తర్వాత దుకాణాల్లోకి వరదనీరు చేరింది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు మొదటిసారి రికార్డు స్థాయిలో భారీ వరద నమోదైంది. మేడిగడ్డ బ్యారేజీలోకి ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ బ్యారేజీలో మొత్తం 85 గేట్లను తెరిచి 12,10,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతీ బ్యారేజీలో 65 గేట్లకు గానూ 62 గేట్లు ఎత్తారు. బ్యారేజీకి 7,78,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. అదే స్థాయిలో ఔట్ ఫ్లో జరుగుతోంది.