Constable candidate Mahesh Death Many parties protested: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థి లింగమల్ల మహేష్ మృతి పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో యువకులు, క్రీడాకారులు, పలు పార్టీలు, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టారు. మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం 1600 మీటర్ల పరుగు పందెం గురించి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన లింగమల్ల మహేశ్ (29) హైదరాబాద్‌లోని అంబర్‌పేట సీపీఎల్ మైదానంలో శనివారం ఉదయం 1600 మీటర్ల పరుగు పందెంను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. పోలీసు అధికారులు అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయినా పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం చనిపోయాడు. దీంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో వారి శోకానికి అంతే లేకుండా పోయింది. మృతుని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని వారికి అప్పగించారు.
మహేశ్ కబడ్డీ, క్రికెట్ క్రీడల్లో ప్రతిభ కనబర్చేవాడు. పలుమార్లు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కబడ్డీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, శారీరకంగా దృఢంగా ఉండేవాడు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో ఉంటూ శిక్షణ తీసుకున్నాడు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన తరవాత హైదరాబాద్‌లోనే ఉంటూ ఈవెంట్ల కోసం నిత్యం సాధన చేస్తూ ఉండేవాడు. పోలీసు ఉద్యోగం సాధించి ఇంటికి వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో అతడి తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో మహా ముత్తారంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మృతి చెందిన మహేశ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కోరారు. పోలీసు నియామకాల్లో 1600 మీటర్ల పరుగు పందెన్ని ప్రభుత్వం ఒకసారి పరిశీలించాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిరసనకు మద్దతు తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహించే బోర్డు ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి ఇవీ చదవండి: