తెలంగాణ

telangana

ETV Bharat / state

'పట్టణ ప్రగతి' లక్ష్యాన్ని నీరుగారుస్తున్న అధికారుల ఉదాసీనత - jayashanker bhupalapally news

మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చి పట్టణాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పురపాలకశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం అమలును అధికార యంత్రాంగం ఉదాసీనత దెబ్బతీస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నగరపాలక సంస్థకు, పురపాలక సంఘానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వడంతో పాటు కీలకమైన అభివృద్ధి పనులను గుర్తించి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశిస్తోంది.

officials negligency in pattana pragathi program
officials negligency in pattana pragathi program

By

Published : May 18, 2022, 6:57 AM IST

రాష్ట్రంలో ఇప్పటివరకు నాలుగు విడతలుగా పట్టణ ప్రగతి జరిగింది. ఈ నెల 20 నుంచి మరోమారు రాష్ట్రవ్యాప్తంగా 141 పట్టణ స్థానిక సంస్థల్లో 10 రోజుల పాటు చేపట్టనున్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుదల, ప్రధాన సమస్యల పరిష్కారం, సమీకృత మార్కెట్‌ యార్డుల నిర్మాణం, ప్రధాన పట్టణాల్లో కూడళ్ల అభివృద్ధి, వైకుంఠధామాల్లో సౌకర్యాల కల్పన, పార్కుల అభివృద్ధి, పట్టణాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం.. ఈ కార్యక్రమం లక్ష్యాలు. పురపాలక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపినచోట సత్ఫలితాలు వస్తున్నాయి. కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, నల్గొండ సహా పనులు పూర్తయిన పట్టణాల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి. పార్కులు వంటివి వినియోగంలోకి వచ్చాయి. పచ్చదనమూ పెరిగింది. అధికార యంత్రాంగం ఉదాసీనత కనబర్చిన పలు పురపాలక సంఘాల్లో నిర్మాణాల పనులు అసంపూర్తిగా ఉండగా, మరికొన్ని చోట్ల ఏళ్లతరబడిగా సాగుతూనే ఉన్నాయి. మరికొన్ని చోట్ల పూర్తయినవాటినీ ప్రజల వినియోగంలోకి తీసుకురాలేదు. రూ.లక్షలు వెచ్చించి కొన్న వాహనాలు, యంత్రాలనూ మూలకు చేర్చారు.

ఇతర పట్టణాల్లో ఇలా..

  • భూపాలపల్లి పట్టణంలో 27 పనులు చేపట్టగా 13 పూర్తయ్యాయి. ఎనిమిది కొనసాగుతూనే ఉన్నాయి. మూడు పనులు ప్రారంభమే కాలేదు. మరో మూడు కోర్టు వివాదాల్లో ఉన్నాయి.
  • భువనగిరిలో రూ.1.55 లక్షల కోట్లతో చేపట్టిన రాయగిరి, అర్బన్‌ కాలనీ, పగిడిపల్లి వైకుంఠధామం పనులు ఏడాదిగా కొనసాగుతూనే ఉన్నాయి.
  • ఆదిలాబాద్‌లో పలు పనులు పూర్తికాకపోగా.. రూ.లక్షలు వెచ్చించి పూర్తి చేసిన పనులను వినియోగంలోకి తీసుకురాలేదు. రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్డి బస్సు నిరుపయోగంగా మారింది. సామూహిక మరుగుదొడ్లను నిర్మించినా ఉపయోగంలోకి తీసుకురాలేదు.
  • నిజామాబాద్‌లో డివిజన్‌కు రూ.20 లక్షల చొప్పున డ్రైనేజీ, రోడ్ల పనులకు గతంలో పట్టణ ప్రగతిలో నిధులిచ్చినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. మూడు సమీకృత మార్కెట్లకుగాను రెండింటి పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
  • జహీరాబాద్‌లో వైకుంఠధామం పనులు పూర్తికాలేదు.
  • కామారెడ్డిలో సమీకృత మార్కెట్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
  • కొత్తగూడెంలో 9 వైకుంఠధామాలు అసంపూర్తిగా ఉన్నాయి.
  • యాదగిరిగుట్టలో పార్కుల ఏర్పాటు శంకుస్థాపనకే పరిమితం కాగా.. మార్కెట్‌ యార్డు నిర్మాణానిదీ అదే పరిస్థితి.
  • అచ్చంపేటలో పాడుపడిన బావిని పూడ్చకుండా అసంపూర్తిగా వదిలేశారు. పూర్తయిన జాబితాలో దీన్ని చేర్చేశారు.

రామగుండం.. నిర్లక్ష్యానికి నిదర్శనం

రామగుండం నగరపాలక సంస్థ.. అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది. ఈ కార్యక్రమం కింద ఈ నగరానికి రూ.34.91 కోట్లు కేటాయించారు. ప్రతిపాదించిన పనుల్లో సగమే పూర్తయ్యాయి. స్వీపింగ్‌ మిషన్లు, కాంపాక్టర్‌లు తదితర వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి. రోడ్లను శుభ్రపరిచే వాహనాన్ని సుమారు రూ.5 కోట్లతో కొన్నా వినియోగంలోకి తీసుకురాలేదు. కూడళ్ల అభివృద్ధి పడకేసింది. పలు పనులు మొదలు కాలేదు. ఆరేడు నెలల క్రితం పార్కులు పూర్తయినా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవగా.. గేట్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details