వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఉమ్మడి జిల్లా ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్‌తో కలిసి అజీం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు అటవీశాఖ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అటవీ జాతుల విత్తనాలు వేయడానికి, వన్యప్రాణులను వేటాడేందుకు ఉపయోగించే ఆయుధాలను పరిశీలించారు. అలాగే గాంధీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అడవుల్లో స్వేచ్ఛగా జీవించడం వన్యప్రాణుల జన్మహక్కని.. వాటి స్వేచ్ఛ జీవితానికి ఆటంకం కలిగిస్తూ వాటిని వేటాడడం పెద్ద నేరమని అధికారులు తెలిపారు. అటవీ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర సంబంధిత అన్ని శాఖల అధికారులు, ప్రజలు వన్యప్రాణుల ఆవశ్యకతను తెలుసుకొని వాటి సంరక్షణకు పాటుపడాలన్నారు.
అటవీ సంరక్షణకు, అటవీ మొక్కల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన వన సంరక్షణ సమితులను రియాక్టివ్ చేసి వనసంరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలని అటవీశాఖకు సూచించారు. ఇటీవల జిల్లాలో పెద్దపులి సంచరించడం అడవుల సంరక్షణకు శుభసూచకమని అన్నారు. వివిధ సందర్భాల్లో వన్యప్రాణులను సంరక్షించిన అటవీశాఖ అధికారులను, పౌరులను సన్మానించారు.
ఇదీ చదవండి:ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్యప్రాణి వారోత్సవాలు