మిషన్ కాకతీయ పథకం ఫోర్త్ ఫేస్‌లో భాగంగా కోటి రూపాయలతో మల్హర్ మండలం వల్లెంకుంట ఊర చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దీనిపై ఇటుక బట్టి నిర్వాహకుల చూపు పడింది. గుత్తేదారులు అధికారులను మచ్చిక చేసుకుని చెరువు మట్టిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం చెరువు కట్టను బలపరచడానికి ఈ మట్టిని వినియోగించాలి. రైతులు కోరితే పొలాలకు వేసుకోవచ్చు.
'చెరువు మట్టిని మింగేస్తున్నారు' - మట్టి అక్రమ రవాణా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంటలో చెరువులో పూడికతీత పనులు అక్రమార్కులకు వరంగా మారింది. అధికారుల అలసత్వంతో పూడిక తీసిన మట్టిని కొందరు అక్రమంగా తరలించుకుంటున్నారు.
నీటిపారుదల శాఖ, గ్రామ పంచాయతీ పాలకవర్గ అనుమతి లేకుండా మట్టిని తరలిస్తుండడం సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నీటిపారుదల శాఖ ఏఈ సారయ్యను వివరణ కోరగా మట్టి తరలించేందుకు ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, రైతుల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో వెళ్లి పరీక్షించగా కొంత మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించడం వాస్తవమేనని... దీనిపై కాంట్రాక్టర్‌ను వివరణ కోరామని తెలిపారు. ఎవరైనా అక్రమంగా తరలిస్తున్నారని తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయమై మల్లంగుంట ఉప సర్పంచ్ వేముల శ్రీశైలం, వార్డు సభ్యుడు జ్యోతుల రమేశ్... ఈమెయిల్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:పోలీసుల సమక్షంలో ఇసుక కుప్పలో శవం వెలికితీత