భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్, కాటారం, మహముత్తారం, మల్హార్, పలిమేల మండలాల్లోని రైతులకు… సుమారు 45 వేల ఎకరాల్లో సాగు నీరందించే చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై(chinna kaleshwaram project) ప్రభుత్వం అలసత్వం చూపుతుందని మంథని ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు(mla sridhar babu) ఆరోపించారు.
చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గారెపల్లి నూతన రిజర్వాయర్ను పరిశీలించి… ఇంకా పరిహారం అందని భూ నిర్వాసితులతో ఆయన ముచ్చటించారు. స్టేజ్-2 పంప్ హౌజ్ వద్ద ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో ప్రాజెక్ట్ పురోగతి, సమస్యలపై సమీక్షించారు. తెరాస ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. ఈ ప్రాంతం నుంచి గోదావరి నీటిని తరలించుకు వెళ్తుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి మీనమేషాలు లెక్కించడం విచారకరమన్నారు. చిన్న కాళేశ్వరాన్ని త్వరగా పూర్తి చేసేలా సీఎం కేసీఆర్(CM KCR)కు ఎన్నో మార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు.