జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి అంబేడ్కర్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికుల వద్దకు వెళ్లి రోజూ ఎంత మంది విధులకు హాజరు అవుతున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తనిఖీ చేశారు. వారు రోజూ చేసే పని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ పని ఒత్తిడికి గురి చేస్తున్నారని... చాలా ఇబ్బంది పడుతున్నామని కార్మికులు వాపోయారు. దీనిపై చర్యలు తీసుకుంటామని గండ్ర హామీ ఇచ్చారు.
నియోజకవర్గం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలి అంటే దానికి ముఖ్య కారణం పారిశుద్ధ్య కార్మికులు అని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఈఎస్ఐ అమలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని వారికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న డబల్ బెడ్ రూమ్లను ఇస్తామని తెలిపారు. మున్సిపాలిటీలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.