అధికారుల లెక్కల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మిషన్ భగీరథ పనులు అంతటా పూర్తయినట్లు చెబుతున్నారు. కాని క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఎక్కడ చూసినా ఏదో సమస్య వెంటాడుతూనే ఉంది. జిల్లాలోని 274 పంచాయతీలు 422 ఆవాసాల్లో మిషన్ భగీరథ పనులు చేపట్టారు. 103245 ఇళ్లకు నల్లాలు బిగించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మరోవిధంగా ఉంది. పూర్తయిన చోట లీకేజీలు, అవసరానికి తగ్గట్టుగా నీరు రాకపోవడం, పనుల్లో జాప్యం జరుగుతోంది.
జిల్లాలో 622 ట్యాంకుల ద్వారా నీటిని అందిస్తున్నారు. నూతనంగా 347 నిర్మించారు. 1954.23 కిలోమీటర్ల పైపులైన్లకు గానూ 1509.36 కిలోమీటర్లకు మంజూరైంది. ఇందులో 1302 కిలోమీటర్లు పూర్తయ్యింది. ఇంకా 206.82 కిలోమీటర్ల మేర పురోగతిలో ఉన్నాయని అధికారుల రికార్డుల్లో నమోదు చేశారు.
తాడిచర్లలో అసంపూర్తిగా పైపులైను నిర్మాణం
అంతటా అసంపూర్తిగానే..
- రేగొండ మండలంలో 37 పంచాయతీలుండగా, 10 గ్రామాలు మినహా మిగతా పనులు పూర్తి కాలేదు. కొత్తగా పైపులైను మంజూరు అయినా పనులు ప్రారంభం కాకపోవడంతో పాతలైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
- మల్హర్ మండలం కేశవపూర్‌లో ట్యాంకు నిర్మించినా కనెక్షన్ ఇవ్వలేదు. పాత పద్ధతిన డైరెక్ట్ పంపింగ్ ద్వారా నీరందిస్తున్నారు. నిమ్మగూడెంలో ట్యాంకుకు కనెక్షన్ ఇవ్వలేదు. యత్నారంలో నిర్మించిన ట్యాంకుకు సరిపడా నీరు చేరడం లేదు.
- మహదేవ్‌పూర్, కాళేశ్వరం పంచాయతీల్లో కొత్త పైపులైను నిర్మాణం కొనసాగుతోంది.
- టేకుమట్ల మండలం దుబ్యాల, మందలోరిపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాలకు సరిగా నీరందడం లేదు.
- గణపురం మండలంలోని దశరథం గ్రామానికి నీరు అందక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారంలో సరఫరా సరిగా లేదు.
- మల్హర్ మండల కేంద్రం తాడిచర్లలో పైపులైను పూర్తికాకపోవడంతో సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లక్ష్మీ నగర్‌లో పైపులైను లీకేజీ అవుతోంది. బీసీ కాలనీలో నిర్మాణంలో ఉంది. మల్కలపల్లిలో పనులు ప్రారంభమే కాలేదు.
- నాచారం పంచాయతీ పరిధిలోని హమీరాబాద్‌లో మిషన్ భగీరథ పనులే ప్రారంభం కాలేదు.
- చిట్యాల మండలం గుంటూరుపల్లిలో మిషన్ భగీరథ ట్యాంకు ఉన్నా డైరెక్ట్ పంపింగ్ ద్వారానే నీటిని అందిస్తున్నారు. చల్లగరిగెలోనూ సమస్యలున్నాయని నీటిని ట్యాంకుకు ఎక్కించడం లేదు. వరికోల్‌పల్లి, కుమ్మరిపల్లిలో లీకేజీలు అవుతుండటంతో పాతపైపులైను ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అందుగుతండాలో పైపులైనును గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
- చిట్యాల మండలం నవాబ్‌పేటలో ఇటీవల మిషన్‌భగీరథ నీటిలో బురద, ఇసుక వచ్చింది. కైలాపూర్ శివారు శాంతినగర్‌లో ట్యాంకులో సైతం ఇసుక వచ్చింది.
- మొగుళ్లపల్లి మండలం మేదరిమెట్ల, చింతలపల్లి, రంగాపూర్ గ్రామాల్లో పనులు అసంపూర్తిగా ఉండటంతో నీటి సరఫరా సక్రమంగా లేదు.