మిర్చి పండిస్తే.. కన్నీరు మిగిలింది! మిర్చి.. తింటే కళ్లలోంచి వచ్చే నీళ్ల సంగతి అటుంచితే... మిర్చి పండించే రైతు కూడా కళ్లనీళ్లు పెట్టుకుంటున్నాడు. చీడ పురుగులు పంట నాశనం చేస్తే.. అకాల వర్షం మిర్చి రైతును మరింత ముంచింది. కనీసం మిగిలిన పంటనైనా కోసి నాలుగు రూపాయలు దక్కించుకుందామంటే.. కూలీ ఖర్చులు కూడా వచ్చేలా లేవు. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మిర్చి రైతులు విలవిలలాడుతున్నారు.
నష్టాలే మిగిలాయి..
పంట వేసేటప్పుడు మార్కెట్లో రేటు బాగానే ఉంది. మార్కెట్లో ధర చూసి సంతోషంగా మిర్చి సాగు చేశారు. కానీ.. రాను రాను ధరలు పడిపోయాయి. దీనికి తోడు.. పంటకు పట్టిన చీడ రోజురోజుకు పంటను మింగేస్తుంది. చూస్తుండగానే.. మార్కెట్లో మిర్చి ధరలు సగానికి సగం పడిపోయాయి. పండిన పంటను మార్కెట్‌కి తీసుకెళ్లి తూకం వేస్తే.. చీడ పట్టింది.. నాణ్యత లేదు అంటూ క్వింటాలుకు కనీసం పదివేలు కూడా ఇవ్వలేదు. చేసేదేమీ లేక వచ్చేది గిట్టుబాటు ధర కంటే తక్కువకే పంటను అమ్మి నష్టాలు మూట గట్టుకుని ఇంటిబాట పట్టారు. కనీసం మిగిలిన పంట వరకైనా మార్కెట్లో ధర పెరుగుతుందనుకుంటే.. అకాల వర్షం మిర్చి రైతును నిండా ముంచింది.
వర్షమే ముంచింది..
భూపాలపల్లి జిల్లా ములుగులో అకాల వర్షం మిర్చి రైతుల పాలిట శాపంగా మారింది. అకాల వర్షానికి కొంత పంట పాడవగా, మిగిలనవి తడిసి నల్లబారిపోయాయి. దీనికి తోడు.. మిర్చి ఏరడానికి వచ్చే కూలీలు రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు కూలీ డిమాండ్ చేస్తున్నారు. ఇంత చేసి చేతికొచ్చిన పంటను మార్కెట్‌కి తీసుకెళ్లిన పంటకు క్వింటాలుకు పదివేలు కూడా ఇవ్వడం లేదు. వర్షంలో తడిసిన మిర్చి నల్లరంగులోకి మారిపోవడంతో వ్యాపారులు మిర్చి రేటు అమాంతం తగ్గించేస్తున్నారు. లక్షలకు లక్షలు అప్పు తెచ్చి పంట వేస్తే.. ఆదాయం మాత్రం వేలు కూడా దాటడం లేదని మిర్చి రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోని మిర్చి రైతులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రైతులు పండించిన పంటకు స్థిరమైన ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. మేలుజాతి కాయకు కనీసం.. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ధర నిర్ణయించాలని కోరుతున్నారు.
గతంలో.. పంట మొత్తం ఏరిన తర్వాత తాలుకాయలు ఏరడానికి కూలీలను పిలుచుకునేది. కానీ.. ఇప్పుడు.. అకాల వర్షానికి, చీడ పురుగుల కారణంగా పంటమొత్తం పాడై పోగా.. మిగిలిన కాయలు ఏరడానికి కూలీలను పిలవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు మిర్చి రైతులు.
ఇవీ చూడండి:సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం