కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ప్రాజెక్టు అంతా జలకళను సంతరించుకుంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజికి భారీగా వరద పోటెత్తుతోంది. మొత్తం 85 గేట్లలో 57 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మంగళవారం వరకు 35 గేట్లు తెరిచి ఉంచగా.. బుధవారం నాటికి 57 గేట్లను ఎత్తారు. ఎగువ ప్రాంతం నుంచి 4,46,200 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. 4,30,600 క్యూసెక్కుల జలాలను దిగువకు వదులుతున్నారు. ఫలితంగా 16.17 టీఎంసీల సామర్థ్యమున్న మేడిగడ్డ బ్యారేజిలో ప్రస్తుతం 11.40 టీఎంసీల నీటి నిల్వ ఉంది.