Medigadda Barrage Issue Latest Update :తెలంగాణలో గత కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరంలో పలు బ్యారేజీల్లో చోటుచేసుకున్న ఘటనలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశం సంచలనం సృష్టించింది. మేడిగడ్డలోని ఏడో బ్లాకులో 20వ పియర్‌తో పాటు 19, 21 పియర్స్ కుంగాయి. వీటి ప్రభావం ఆనకట్ట మొత్తాన్ని కదిలించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే ఈ విషయం తెలిసిపోతుంది.
ముఖ్యంగా ఏడో బ్లాకు సమీపంలో ఉండే ఆరో బ్లాకులోని పలు పియర్స్‌పై ఉన్న ఇనుప దిమ్మెలు (గాంట్రీ ట్రాక్ గిర్డర్) కదిలిపోయాయి. ఇనుప దిమ్మెలను అనుసంధానం చేసేందుకు వేసిన జాయింట్లు కూడా చాలా చోట్ల విరిగిపోయాయి. అక్టోబరు 21వ తేదీన బ్యారేజీ కుంగుబాటుకు గురైతే 24వ తేదీ నాటికి పగుళ్లు కాస్త పెరిగాయి. అయితే అక్కడితో కుంగుబాటు ఆగిందని నీటి పారుదల శాఖ చెబుతోంది.
Medigadda Barrage Damage Latest News :ఏడో బ్లాకులో చోటుచేసుకున్న కుంగుబాటును శోధించేందు కోసం బ్యారేజీకి ఎగువన కాఫర్ డ్యాం నిర్మాణానికి పనులు షురూ చేశారు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం అంబట్‌పల్లి సమీపంలో గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నదిలో వాహనాల రాకపోకలకు వీలుగా మట్టి రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ బ్యారేజీని 16.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఇందులో 8 బ్లాకులు ఉన్నాయి. ఒక్కో బ్లాకులో 11 క్రెస్టు గేట్లు ఉండగా, ఏడో బ్లాకులోని రెండు గేట్లకు ఇరువైపులా ఉండే పియర్స్‌కు పగుళ్లు ఏర్పడి గ్యాప్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావం సమీప బ్లాకులపైనా ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త ఆయకట్టు కష్టమేనంటున్న ఇంజినీరింగ్ అధికారులు
నిశితంగా పరిశీలిస్తే ఆరో బ్లాకుపై పలు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. 19, 20, 21 పియర్స్‌పై ఉండే ఇనుప బీమ్‌లు కిందికి దిగడంతో వాటి మధ్య ఉండే జాయింట్లు పగిలిపోయాయని , 2, 23, 24 పియర్స్‌పైన ఉన్న బీమ్‌ల జాయింట్లు కూడా పగుళ్లు వచ్చి ఒరిగిపోయాయని వెల్లడించారు. పియర్స్ అన్నీ ఒకే ఎత్తులో ఉన్నప్పుడు ఇనుప బీమ్స్ కూడా సమాంతరంగా ఉంటాయని పియర్స్ భూమిలోకి దిగిపోయిన చోట బీమ్స్ కూడా కిందికి జరగడంతో జాయింట్లు పగిలిపోయి ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి ఏడో బ్లాకు ఒక్కటే కాకుండా సమీప బ్లాకుల్లో వచ్చిన మార్పులను నిశితంగా పరిశీలించాల్సిందేనని నిపుణులు భావిస్తున్నారు.
Cause Of Medigadda Barrage Damage :పియర్స్ కుంగడంతో మూడు క్రెస్టు గేట్లను మార్చాల్సి వస్తుందని ఈఎన్సీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గేట్ల నిర్వహణకు ఏర్పాటు చేసిన వించ్, యాక్సెస్ లాడర్, వాక్ వే- 1, వాక్ వే-2, గేట్లను తెరిచేందుకు, మూసేందుకు ఉపయోగించే ప్రత్యేక పరికరం నడిచే గాంట్రీ వాక్ గిర్డర్ బీమ్‌లను పూర్తిగా మార్చనున్నట్లు వెల్లడించారు.