Medigadda Barrage Bridge Pillars Slightly Sagged : జల ప్రదాయినిగా పేరుగాంచిన కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ (Medigadda Barrage) వంతెన కొంతమేర కుంగింది. శనివారం రోజు పొద్దుపోయాక భారీ శబ్దంతో బీ-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు భావిస్తున్నారు. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా కుంగిన ప్రాంతం మహారాష్ట్రవైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యామ్ పరిసరాల్లో అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర- తెలంగాణ రాష్ట్రాల మధ్య బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు.
Kaleshwaram Project : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో ఘట్టం ఆవిష్కృతం... ఏకకాలంలో 35 మోటార్లు రన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరిపై 2019లో మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. వంతెన కుంగిన సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25,000 క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా.. 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో ఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల నిల్వ ఉంది. శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.
Lakshmi Barrage Bridge Bent in Jayashankar Bhupalapally District : ఆ సమయంలో మరికొన్ని శబ్దాలు రావడంతో ఉన్నతాధికారులకు తెలియజేశారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన జలాశయాన్ని ఖాళీచేసే చర్యలు మొదలుపెట్టారు. తొలుత 12 గేట్లు.. ఆ తర్వాత వాటిని 46కు పెంచి.. దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేరకు ప్రాజెక్టును ఖాళీ చేసి.. వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది పరిశీలించనున్నారు. బ్యారేజీ పరిసరాల్లోకి అధికారులు ఎవరినీ అనుమతించట్లేదు.